LS polls: మెజార్టీల్లో రికార్డుల మోత.. 11 లక్షలతో ఆయనే టాప్‌!

సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా భాజపా నేత ప్రీతమ్‌ ముండే పేరిట రికార్డు ఉండగా.. తాజాగా ఆ రికార్డును లాల్వానీ అధిగమించారు.

Updated : 04 Jun 2024 23:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నేతల్లో.. పలువురు భారీ మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. ఇందౌర్‌ లోక్‌సభ స్థానం సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ.. తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 11.72 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి చరిత్ర తిరగరాశారు. మొత్తంగా ఆయనకు 12,26,751 ఓట్లు పోలవగా.. రెండో స్థానంలో నోటా (NOTA)కు 2,18,674 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థికి కేవలం 51వేల ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.

సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా భాజపా నేత ప్రీతమ్‌ ముండే పేరిట రికార్డు ఉండగా.. తాజాగా ఆ రికార్డును లాల్వానీ అధిగమించారు. బీఢ్‌ లోక్‌సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికలో 6.96 లక్షల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, గుజరాత్‌ భాజపా నేత సీఆర్‌ పాటిల్‌లు ఏడు లక్షలకు పైగా మెజార్టీ సాధించిన వారి జాబితాలో ఉన్నారు.

  • ఆస్సాంలోని ధుబ్రీ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్ 10.12 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.. ఆయనకు 14,71,885 ఓట్లు వచ్చాయి.
  • మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విదిశ నుంచి పోటీచేసి 8.21లక్షల మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా ఆయనకు 16.11 లక్షల ఓట్లు వచ్చాయి.
  • 2019 ఎన్నికల్లో గుజరాత్‌లోని నవసరిలో భాజపా నేత సీఆర్‌ పాటిల్‌ 6.89 లక్షల మెజార్టీ సాధించగా.. తాజా ఎన్నికల్లో 7.73 లక్షలకుపైగా మెజార్టీతో సొంత రికార్డును తిరగరాసుకున్నారు.
  • అమిత్‌ షాకు మొత్తం 10.10 లక్షల ఓట్లు రాగా.. ప్రత్యర్థిపై 7.44 లక్షల మెజార్టీ సాధించారు.
  • బెంగాల్‌లోని డైమండ్‌ హార్బర్‌ లోక్‌సభ స్థానం సిటింగ్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ (టీఎంసీ) 7.10 లక్షల మార్జిన్‌తో విజయం సాధించారు. ఆయనకు 10.48 లక్షల ఓట్లు పోలయ్యాయి. 
  • మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా..5.4 లక్షల మెజార్టీతో గెలుపొందారు.
  • వడోదర నుంచి భాజపా అభ్యర్థి హేమంగ్‌ జోషి 5.82 లక్షల మెజార్టీతో విజయం సాధించారు.
  • తెలంగాణలోని నల్గొండ లోక్‌సభ నుంచి బరిలో ఉన్న కుందూరు రఘువీర్‌ 5.59 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు మొత్తంగా 7.84 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.
  • ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 4.67లక్షల మెజార్టీతో ముందున్నారు. మొత్తం ఆయనకు 7.66 లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి.
  • మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌.. 3.91 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
  • రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. 3.90 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. వయనాడ్‌ నుంచి కూడా 3.64 లక్షల మార్జిన్‌తో గెలుపొందారు.
  • వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. 1.52 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు