Election Commission: 65 శాతానికిపైగా పోలింగ్‌..! రాష్ట్రపతి చేతికి కొత్త ఎంపీల జాబితా

లోక్‌సభ విజేతల జాబితాను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్లు గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించారు.

Published : 06 Jun 2024 22:20 IST

దిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) దాదాపు 65.79 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది. అయితే, ఇది పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓట్ల శాతమని, పోస్టల్‌ బ్యాలెట్‌లను ఇంకా లెక్కలోకి తీసుకోనందున తుది శాతంలో మార్పు ఉండొచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన వివరాల ఆధారంగా వివరణాత్మక గణాంకాలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌సింగ్‌ సంధూలు గురువారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. లోక్‌సభ విజేతల జాబితాను ఈ సందర్భంగా సమర్పించారు. ప్రజాస్వామ్య పండగను విజయవంతంగా నిర్వహించడంపై ఎన్నికల సంఘం, కేంద్ర, రాష్ట్ర అధికారులు, సిబ్బంది, భద్రత బలగాలకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పూర్తి చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న కోట్లాది ఓటర్లనూ ప్రశంసించారు.

పోలింగ్‌లో ప్రపంచ రికార్డు

కొత్త ఎంపీల జాబితా రాష్ట్రపతి వద్దకు చేరుకున్న నేపథ్యంలో.. 18వ లోక్‌సభ ఏర్పాటుకు అధికారిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే 17వ లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి.. మంత్రిమండలి రాజీనామాకు ఆమోదముద్ర వేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు పదవుల్లో కొనసాగాలని మోదీ సహా మంత్రులను కోరారు. మోదీని అధికారికంగా తమ నాయకుడిగా ఎన్నుకునేందుకు ఎన్డీయే కూటమి ఎంపీలు శుక్రవారం సమావేశం కానున్నారు. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎన్డీయే నేతలంతా రాష్ట్రపతికి అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది ఓట్లు వేశారని, ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు అని ఈసీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో దేశంలో 91.20 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 61.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 67.40 శాతం పోలింగ్‌ నమోదైంది. 2024 నాటికి ఓటర్ల సంఖ్య 96.88 కోట్లకు పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని