CISF: పార్లమెంటు భద్రత.. రంగంలోకి 140 మంది ‘సీఐఎస్‌ఎఫ్‌’ సిబ్బంది

పార్లమెంటు కాంప్లెక్స్‌లో భద్రత కోసం 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని కేంద్రం మోహరించింది. సందర్శకులు, సామగ్రి తనిఖీల బాధ్యతలు వీరు నిర్వహించనున్నారు.

Updated : 23 Jan 2024 18:50 IST

దిల్లీ: గతేడాది శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటులో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపడంతో స్థానికంగా భద్రత (Security of Parliament)పై అనేక సందేహాలు తలెత్తాయి. దీంతో ఆ భవన సముదాయంలో సమగ్ర భద్రత బాధ్యతలను సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF)కు అప్పగించాలని నిర్ణయించిన కేంద్రం.. తాజాగా 140 మంది సిబ్బందిని మోహరించింది. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల వేళ పార్లమెంటు కాంప్లెక్స్ వద్ద సందర్శకులు, సామగ్రి తనిఖీల బాధ్యతలను వీరు నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 140 మందిలో 36 మంది సీఐఎస్‌ఎఫ్‌ అగ్నిమాపక విభాగానికి చెందినవారు.

అలజడి ఘటన.. పార్లమెంట్‌ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం..!

డిసెంబరు 13న లోక్‌సభలో జీరో అవర్‌ జరుగుతుండగా.. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వెదజల్లారు. మరో ఇద్దరు భవనం వెలుపల ఆందోళన చేశారు. దీంతో పార్లమెంటు భవన సముదాయంలో భద్రతపై కేంద్ర హోంశాఖ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దించింది. విమానాశ్రయాల్లో సెక్యూరిటీ తరహా సేవలను ‘సీఐఎస్‌ఎఫ్‌’ అందించనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌రే యంత్రాలు, డిటెక్టర్లతో సందర్శకులను, వస్తువులను తనిఖీ చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

దాదాపు 1.70 లక్షల మంది సిబ్బందితో కూడిన ‘సీఐఎస్‌ఎఫ్‌’.. కేంద్ర హోంశాఖ అధీనంలోని కేంద్ర సాయుధ పోలీసు దళం. ఇది దిల్లీలోని పలు కేంద్రశాఖల భవనాలతో పాటు 68 పౌర విమానాశ్రయాలు, అణుశక్తి, ఏరోస్పేస్‌ కేంద్రాలు, దిల్లీ మెట్రో వద్ద భద్రత కల్పిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని