Prajwal Revanna: బెంగళూరులో దిగిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. అరెస్టు చేసిన సిట్‌ పోలీసులు

పలువురు మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. 

Published : 31 May 2024 06:33 IST

బెంగళూరు: పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)ను బెంగళూరు (Bengaluru) పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను భారీభద్రత మధ్య విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు.

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఎన్డీయే కూటమి తరఫున హాసన నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన జాడ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.

ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్‌’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు