Dera Sacha Sauda: హైకోర్టులో డేరా బాబాకు ఊరట.. రంజిత్‌ సింగ్‌ హత్యకేసులో నిర్దోషిగా తీర్పు

డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మిత్‌ రామ్‌ రహీం బాబాకు ఓ కేసులో ఊరట లభించింది. తన ఆశ్రమ ఉద్యోగి హత్య కేసులో నిర్దోషిగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. 

Updated : 28 May 2024 15:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డేరా సచ్చా సౌదా చీఫ్‌, వివాదాస్పద మతగురువు గుర్మింత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు పంజాబ్‌-హరియాణ హైకోర్టులో ఊరట లభించింది. ఓ హత్య కేసులో మంగళవారం అతడిని న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. జస్టిస్‌ సురేష్‌వార్‌ ఠాకూర్‌, జస్టిస్‌ లలిత్‌ బత్రాతో కూడిన డివిజన్‌ బెంచ్‌ డేరా బాబా అప్పీల్‌ను పరిశీలించింది. 

వాస్తవానికి ఇప్పటికే పంచ్‌కులలోని సీబీఐ కోర్టు ఒక రేప్‌, జర్నలిస్టు రామ్‌ చందర్‌ ఛత్రపతి, డేరా నిర్వాహకుడు రంజిత్‌ సింగ్‌ హత్య కేసుల్లో బాబాను నిందితుడిగా పేర్కొంటూ తీర్పును ఇచ్చింది. దీనిని డేరాబాబా హైకోర్టులో సవాలు చేశారు. వీటిల్లో తాజాగా రంజిత్‌ సింగ్‌ హత్యకేసులో నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు వచ్చింది. ఇక అత్యాచారం, జర్నలిస్టు ఛత్రపతి హత్య కేసుల్లో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. ప్రస్తుతం అతడు రోహ్‌తక్‌లోని సునారియా జైల్లో ఉంటున్నాడు. ఈ కేసులో ఆయనతోపాటు మరో నలుగురు సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

డేరా బాబాకు అనుచరుడిగా ఉన్న రంజిత్‌ సింగ్‌ 2002లో హత్యకు గురయ్యారు. ఆయన ఆశ్రమంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులను పేర్కొంటూ రాసిన ఓ లేఖ అప్పట్లో కలకలం రేపింది. అయితే, అది ఆశ్రమ మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ రాసినట్లు డేరా బాబా అనుమానించారు. దీంతో ఆయనను హత్య చేసేందుకు డేరా బాబా కుట్రపన్నినట్లు సీబీఐ పేర్కొంది. 

సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్‌ దైవత్వం పొందే మార్గమంటూ దాదాపు 400 మంది శిష్యులను వంధ్యులుగా మార్చారన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. పలువురు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరస్కరించిన వారిని హత్య చేసేవారని చెబుతుంటారు. ఇలా వివాదాస్పద గురువుగా ఉన్న గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని తేలడంతో 2017లో జైలుకు వెళ్లారు. ఆ కేసులో సీబీఐ కోర్టు ఆయనకు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు