Himachal Pradesh: కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ

రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించి క్రాస్‌ ఓటింగ్‌కి పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

Published : 18 Mar 2024 16:14 IST

దిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో కాంగ్రెస్‌ (Congress) రెబల్‌ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ విధించిన అనర్హత వేటుపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు  (Supreme Court)నిరాకరించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా దీనిపై స్పందన తెలియజేయాలని కోరింది. ఆరుగురు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ కోర్టు పరిధిలో ఉన్నందున అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు, ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఈ ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్రకటించిన నేపథ్యంలో దానిపై స్టే విధించే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని తెలిపింది. తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది. 

సార్వత్రిక ఎన్నికల కోసం ఇటీవల షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్నికల సంఘం.. హిమాచల్‌ ప్రదేశ్‌లో అనర్హత వేటు పడిన ఆరు స్థానాల్లో ఉప ఎన్నిక చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు మే  7 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ప్రకటించింది. గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్‌ ధిక్కరించి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. వీరిపై ఫిబ్రవరి 29న స్పీకర్‌ అనర్హత వేటు విధించారు. దీనిపై వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఎమ్మెల్యేలపై వేటుతో అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం 40 నుంచి 34కి పడిపోయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని