DK Shivakumar: కుర్చీ అంత ఈజీగా దొరకదు.. చిక్కితే వదలొద్దు: డీకే శివకుమార్‌

Eenadu icon
By National News Team Updated : 12 Jul 2025 12:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

బెంగళూరు: కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశంపై రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రినని ఓవైపు సిద్ధరామయ్య నొక్కి చెబుతున్నారు. అటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌..  తన చేతుల్లో ఏమీ లేదంటూనే ‘ఆశ పడటంలో తప్పులేదు కదా’ అనే సంకేతాలిస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా డీకే (DK Shivakumar) చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. కుర్చీ దొరికితే వదలొద్దంటూ అధికార పీఠంపై తనకున్న ఆసక్తి గురించి ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరు (Bengaluru)లో న్యాయవాదుల సంఘం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో డీకే శివకుమార్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలామంది లాయర్లు సీట్లు ఖాళీగా ఉన్నా అందులో కూర్చోవట్లేదు. కానీ, మేమందరం మాత్రం ఓ కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటాం. కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదు. ఒకవేళ దొరికితే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. అందులో కూర్చోవాలి. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా నవ్వులు చిందించారు. అయితే, ఇందులో ఆయన అధికారం అనే పదాన్ని ఉపయోగించనప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించే డీకే ఇలా మాట్లాడారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ (Congress) అధికారంలోకి వచ్చినప్పటినుంచే డీకే, సిద్ధరామయ్య (Siddaramaiah)ల మధ్య కుర్చీలాట మొదలైన సంగతి తెలిసిందే.

కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేసింది. చివరకు సీనియార్టీ, ఇతరత్రా అంశాలను దృష్టిలోపెట్టుకొని సిద్ధరామయ్యను హైకమాండ్‌ ఎంచుకుంది. అయితే, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని అప్పటినుంచే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే దీనిపై వ్యాఖ్యలు చేశారు. దీనిపై డీకే, సిద్ధరామయ్య ఇద్దరూ స్పష్టతనిస్తూనే ఉన్నా.. రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది. అయితే, సిద్ధరామయ్యను  గద్దె దించితే పార్టీ రెండుగా చీలిపోతుందని అధిష్ఠానం భయపడుతోంది. అందుకే.. ఆయనను కొనసాగించేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Tags :
Published : 12 Jul 2025 12:01 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు