Nirmala Sitharaman: అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా.. ‘రామా బ్లూ’ చీరలో నిర్మలమ్మ

బడ్జెట్‌ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman).

Updated : 01 Feb 2024 12:33 IST

దిల్లీ: నేడు బడ్జెట్‌(union budget 2024-25) పండగ. ఫిబ్రవరి ఒకటిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) కురిపించే వరాల జల్లు కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. అలాగే ప్రతి ఏడాది ఈ ప్రత్యేకమైన రోజున ఆమె ధరించే చీరలపైనా అందరి దృష్టి ఉంటుంది. ఈ రోజు బడ్జెట్ ట్యాబ్‌ పట్టుకొని నీలంరంగు చీరలో కనిపించారు. ఈ టస్సర్ పట్టు చేనేత చీర.. గోధుమ రంగులో బెంగాలీ సంస్కృతిని ప్రతిబింబించే ఎంబ్రాయిడరీతో మెరిసిపోయింది. ఈ నీలివర్ణాన్ని తమిళనాడులో ‘రామా బ్లూ’ అని పిలుస్తారు. ఇటీవల అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు సంకేతంగా ఆమె ఈ రంగు చీరను ధరించారు. మొత్తంగా అటు బెంగాల్‌, ఇటు తమిళనాడు సంప్రదాయాలను కలగలిపిన చీరతో ఆమె మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు.

ఆమె 2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గరి నుంచి ఈ రోజు వరకు చేనేత చీరే ధరిస్తున్నారు. వాటిపై తన ప్రేమను ఓ సందర్భంలో ప్రస్తావించారు కూడా. ‘సిల్క్‌, కాటన్ ఏదైనా కానీ.. ఒడిశా చేనేత చీరలు నాకిష్టమైన వాటిలో ఒకటి. వాటి రంగు, నేత పని, ఆకృతి బాగుంటాయి’ అని వెల్లడించారు. 

  • 2023లో బ్రౌన్‌ రంగులో టెంపుల్‌ బోర్డర్‌లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు. 
  • 2022లో మెరూన్‌ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీరే. ఆ రంగు దుస్తుల్లో ఆమె చాలా సాదాసీదాగా కనిపించారు. ఇది ఆమె నిరాడంబరతకు నిదర్శమని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 
  • 2021లో ఎరుపు-గోధుమ రంగు కలగలిసిన భూదాన్‌ పోచంపల్లి చీరలో కనిపించారు. తెలంగాణకు చెందిన ఈ పోచంపల్లిని సిల్క్‌ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 
  • 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో మెరిశారు. ఈ రంగు శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుంది. అలాగే ‘ఆస్పిరేషనల్‌ ఇండియా’ థీమ్‌కు అనుగుణంగా దీనిని ధరించారు. 
  • 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్‌కేస్‌ స్థానంలో బహీ ఖాతాతో మీడియా ముందుకువచ్చారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని