Bihar elections: పట్నాలో మారింది కొంతే.. మారాల్సిందెంతో!

Eenadu icon
By National News Desk Updated : 02 Nov 2025 19:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

పరిశ్రమలు, ఐటీ రంగం రావాలని కోరుకుంటున్న పట్నా యువతరం
అలాంటి వారికే ఓటేస్తామని స్పష్టీకరణ
ఇప్పటికీ ఇతర నగరాలకు వలసే..

దేశంలోని ఇతర నగరాలకు భిన్నంగా ఉండే బిహార్‌ రాజధాని పట్నాలో ఒకప్పుడు పరిస్థితి భయం భయంగా ఉండేది. కిడ్నాప్‌లు, హత్యలతో అట్టుడికేది. బలవంతపు వసూళ్లకు కేంద్రంగా ఉండేది. ఉపాధి ఎలాగూ ఉండేది కాదు.. వ్యాపారం చేసుకోవాలన్నా జనం భయపడేవారు. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒకప్పుడు సాయంత్రమైతే నగరం బోసిపోయేది. కానీ ఇప్పుడు సాయం సంధ్యవేళల్లో జనం గంగా నదీ తీరాన సేదతీరుతున్నారు. రాత్రుళ్లు పట్నా మెరీన్‌ డ్రైవ్‌గా పిలిచే ఆ ప్రాంతంలో వెలుగుజిలుగుల మధ్య ఆహ్లాదంగా గడుపుతున్నారు. కానీ ఇప్పటికీ ఈ నగరం ఎంతో మారాల్సి ఉందని అంటున్నారు అక్కడి యువతరం. పరిశ్రమలు రావాలని, ఐటీ రంగం వేళ్లూనుకోవాలని, స్థానికంగానే ఉపాధి లభించాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇతర నగరాలకు వలస వెళ్లి చదువు కోవాల్సి వస్తోందని, ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి హామీలిచ్చే నేతలకే ఓటేస్తామని స్పష్టం చేస్తున్నారు. పట్నాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

గత ఎన్నికల్లో పట్నాలోని 9 నియోజకవర్గాల్లో మహాగఠ్‌బంధన్, 5 చోట్ల ఎన్డీయే విజయం సాధించాయి.

అతి పెద్ద పల్లెటూరు నుంచి..

బిహార్‌లో 90శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. పట్టణాలు, నగరాలున్నా అవీ దాదాపుగా గ్రామీణ వాతావరణాన్నే పోలి ఉంటాయి. సరైన రోడ్లు, సౌకర్యాలుండవు. ఒక్క రాజధాని పట్నానే రాష్ట్రంలో అతి పెద్ద నగరంగా ఉంటుంది. అదీ గతంలో అతి పెద్ద పల్లెటూరుగా ఉండేది. నీతీశ్‌ అధికారంలోకి వచ్చాక ఆ నగరం రూపురేఖలను మార్చారు. మాల్స్‌ వచ్చాయి. గంగా నదీ తీరాన్ని అభివృద్ధి చేశారు.  

బయటికి ఎందుకు వెళ్లాలి?

రాష్ట్రాన్ని వదిలేసి చదువులు, ఉపాధి కోసం బెంగళూరు, నొయిడా, చెన్నైవంటి నగరాలకు ఎందుకు వెళ్లాలని పట్నాలోని యువత ప్రశ్నిస్తోంది. బిహార్‌లో ఇంకా విద్యా వ్యవస్థ మెరుగుపడలేదనేది వారి ఆరోపణగా ఉంది. అయితే విచిత్రంగా ఈ ప్రశ్నలను వారు నీతీశ్‌నే అడుగుతున్నారు. కొద్దోగొప్పో అభివృద్ధి చేసిన ఆయనే ఇవీ చేయాలని వారు కోరుకుంటున్నారు. నీతీశ్‌ హయాంలో 3 రకాల అభివృద్ధి జరిగిందనేది పట్నా వాసుల అభిప్రాయం. శాంతి భద్రతలు, విద్యుత్తు-రోడ్లు-ఫ్లైవోవర్లు, మహిళల సాధికారత కోసం ఆయన కృషి చేశారని నమ్ముతున్నారు. 

  • గతంలోని యాదవ్‌రాజ్‌ వ్యవస్థను తేజస్వీ యాదవ్‌ ఇప్పటికీ అడ్డుకోలేకపోతున్నారని, యాదవ్‌-ముస్లింలు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఉన్న పరిస్థితిని ఆయన మార్చలేకపోతున్నారని యువత అభిప్రాయపడుతున్నారు. 
  • ‘నీతీశ్‌ హయాంలో రోడ్లు, మౌలిక వసతులు బాగుపడ్డాయి. విద్యుత్తుకోతలు తగ్గాయి. కానీ బిహార్‌కు టెక్‌ పార్కులు, కంపెనీలు రావాలి’ అని పట్నా నుంచి చెన్నై వెళ్లి ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అభిప్రాయపడ్డారు. మంచి చదువులు కావాలని, ఉద్యోగాలు స్థానికంగా లభించాలని కోరుతున్నారు. 
  • మహిళలకు భద్రత కల్పించడంతోపాటు ఉపాధి అవకాశాలను నీతీశ్‌ కల్పించారని, ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయంగా మరింత ఎదగాలని ఒడిశాలో చదువుకుంటున్న విద్యార్థిని అభిప్రాయపడ్డారు. 
  • రాష్ట్రం కోసం తేజస్వీ మాట్లాడుతున్న తీరు తనను ఆకట్టుకోలేదని, ఆయన అధికారంలోకి రావాలనుకుంటే మరింతగా చేయాల్సి ఉందని పుణెలో పనిచేస్తున్న యువతి స్పష్టం చేశారు. 
  • కొత్త ముఖం రావాలని 25 ఏళ్ల యువతి ఒకరు అభిప్రాయపడ్డారు. మనం ఇంకా పెన్షన్ల పెంపు, సబ్సిడీల గురించే ఆలోచిస్తున్నామని, దీర్ఘకాల ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. 
  • మార్పు కోరుకుంటున్నామని, అయితే సమర్థులు ఎవరూ లేరనిపిస్తోందని మరో యువతి అభిప్రాయపడ్డారు.

నేషనల్‌ డెస్క్‌

Tags :
Published : 02 Nov 2025 19:07 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు