Supreme Court: నివాసప్రాంత ఆధారిత కోటా రాజ్యాంగ ఉల్లంఘనే

Eenadu icon
By National News Desk Published : 30 Jan 2025 04:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఎవరు.. ఎక్కడైనా చదువుకోవచ్చు
వైద్యవిద్య పీజీ ప్రవేశాలపై తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
ఇప్పటికే చేరిన వారికి ఇది వర్తించదని స్పష్టీకరణ 

దిల్లీ: వైద్యవిద్య పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో రాష్ట్ర కోటా కింద ‘నివాస ప్రాంత ఆధారిత’ (డొమిసైల్‌ బేస్డ్‌) ప్రవేశాలను అనుమతించలేమని, అది రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్, జస్టిస్‌ సుధాంశు ధూలియా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌ల ధర్మాసనం బుధవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. పీజీ వైద్యవిద్యలో నివాస ప్రాంత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్‌-హరియాణా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో పలువురు సవాల్‌ చేయగా.. తొలుత ఇద్దరు సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. కేసు ప్రాముఖ్యం దృష్ట్యా దానిని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సిఫార్సు చేసింది. ఇప్పుడు ఆ ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. 64 సీట్లలో సగాన్ని చండీగఢ్‌ పూల్‌ కోసం కేటాయించడాన్ని తప్పుబట్టింది. 

రాష్ట్ర నివాసి అనేది ప్రత్యేకంగా లేదు 

‘‘దేశంలో ఎక్కడైనా నివసించేందుకు, ఏ విద్యాసంస్థలోనైనా చదువుకునేందుకు హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. మనమంతా భారత్‌ భూభాగంలో నివసిస్తున్నాం. రాష్ట్ర, లేదా ప్రొవిన్షియల్‌ నివాసి అనేది ప్రత్యేకంగా లేదు. ఉన్నది ఒకటే నివాసప్రాంతం. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం, వృత్తి, వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. అలాగే ఎక్కడైనా చదువుకునే హక్కును కూడా రాజ్యాంగం కల్పించింది. ఒక నిర్దిష్ట రాష్ట్రంలో నివాసం ఉంటున్నవారికి రిజర్వేషన్‌ ప్రయోజనాలు కల్పించడాన్ని ఎంబీబీఎస్‌ కోర్సుల వరకే అనుమతించవచ్చు. స్పెషలైజ్డ్‌ వైద్యుల ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇలాంటి రిజర్వేషన్లను పీజీ వైద్య కోర్సుల్లో కల్పించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే’’ అని ధర్మాసనం తరఫున తీర్పును చదివిన జస్టిస్‌ ధూలియా స్పష్టంచేశారు. ఒకవేళ ఈ రిజర్వేషన్లను అనుమతిస్తే అది అనేకమంది ఇతరుల ప్రాథమిక హక్కుల్లో చొరబడటమే అవుతుందని, వేరే రాష్ట్రానికి చెందినవారనే కారణంతో వారిని వేరుగా చూసినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. సమానత్వ హక్కును ఇది తుంగలో తొక్కుతుందన్నారు. ఆయా సంస్థల ఆధారిత సహేతుక రిజర్వేషన్లు మినహా రాష్ట్రకోటా సీట్లను అఖిలభారత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే నివాసప్రాంత ఆధారంగా రిజర్వేషన్‌ పొందినవారికి ఈ తీర్పు వర్తించదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇప్పటికే అలా చేరి చదువుకుంటున్నవారిపై, ఆ కేటగిరీలో విద్యను పూర్తిచేసినవారిపై ఇది ప్రభావం చూపదని స్పష్టీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు