Swati Maliwal: కేజ్రీవాల్‌ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్‌మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్‌ పోస్టు

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలోనివిగా భావిస్తోన్న కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై స్వాతీమాలీవాల్‌ స్పందించారు. 

Updated : 17 May 2024 17:20 IST

దిల్లీ: ఆప్‌ ఎంపీ స్వాతీమాలీవాల్‌ (Swati Maliwal)పై దాడి నేపథ్యంలో తాజాగా ఆన్‌లైన్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అది దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఇంటిలోనిదని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అందులో మాలీవాల్.. భద్రతా సిబ్బందితో వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.

‘‘ప్రతిసారిలాగే.. ఈసారి కూడా ఈ రాజకీయ హిట్‌మ్యాన్‌ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారు. ఒకరిని కొడుతున్న వీడియో ఎవరు తీస్తారు..? ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే.. నిజం వెలుగులోకి వస్తుంది. నువ్వు ఇంక ఎంతకైనా దిగజారిపో, పైనుంచి దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఒకరోజు అన్ని విషయాలు ఈ ప్రపంచం ముందుకువస్తాయి’’ అని స్వాతి పోస్టు పెట్టింది. అయితే ఇక్కడ హిట్‌ మ్యాన్‌ అని ఆమె ఎవరిని ప్రస్తావించారో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆమ్‌ఆద్మీ పార్టీకి ఎన్నికల వేళ.. మాలీవాల్ కేసు ఇబ్బందికర పరిణామమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ దాడి చేసిన తీరును ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆమె చెప్పిన విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. పంజాబ్‌ మంత్రులు మాత్రం బిభవ్‌ను వెనకేసుకొచ్చారు. ఆయన మంచి వ్యక్తి అని, ఈ కేసు ఒక కుట్ర అని ఆరోపించారు. నిన్న ఆయనపై కేసు నమోదు అయింది. ఈనేపథ్యంలో దిల్లీ పోలీసు బృందం ఆయన ఇంటికి వెళ్లి విచారిస్తోంది. 

కేజ్రీవాల్‌ నివాసానికి పోలీసులు 

ఈ దాడి కేసులో దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్న కేజ్రీవాల్ నివాసానికి దిల్లీ పోలీసులు వెళ్లారు. వారితో పాటు ఫోరెన్సిక్‌ సిబ్బంది కూడా ఉన్నారు. లివింగ్‌ రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించడంతో పాటు సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయనున్నారని తెలుస్తోంది. అలాగే కేజ్రీవాల్ భద్రతా సిబ్బందితో కూడా మాట్లాడనున్నారు.     

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు