Liquor: తమిళనాడులో 500 మద్యం దుకాణాలు మూసివేత

తమిళనాడులో 500మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. గతంలో ఇచ్చిన జీవో అమలులో భాగంగా గురువారం నుంచి ఈ దుకాణాలు మూసివేస్తున్నట్ఉట టాస్మాక్‌ ప్రకటించింది.

Updated : 21 Jun 2023 23:36 IST

చెన్నై: తమిళనాడు(Tamilnadu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 500 మద్యం దుకాణాలను(Liquor shops) మూసి వేస్తున్నట్టు ప్రభుత్వ రిటైలర్‌ టాస్మాక్‌  బుధవారం వెల్లడించింది. తొలి విడతలో పాఠశాలలు, ఆలయాల సమీపంలో ఉన్న మద్యం అంగళ్లను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఎన్నికల సమయంలో  స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే డీఎంకే అధికారంలోకి వచ్చాక మద్యం విధానంలో కీలక మార్పులు చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 31 నాటికి 5329 రీటైల్‌ మద్యం దుకాణాలు ఉండగా..  500 దుకాణాలను తొలుత మూసివేసేందుకు గుర్తించినట్టు ఏప్రిల్‌ 12న మంత్రి సెంథిల్‌ బాలాజీ ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 20న ఇచ్చిన జీవోను ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ (టాస్మాక్‌) గుర్తు చేసింది. ఆ జీవో ఆధారంగానే 500 రీటైల్‌ మద్యం దుకాణాలను గుర్తించి జూన్‌ 22 నుంచి మూసివేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పట్టాలి మక్కల్‌ కచ్చి (పీఎంకే) పార్టీ స్వాగతించింది. మిగిలిన దుకాణాలను సైతం గడువు లోపు మూసివేయాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని