UP Minister: ‘అతీక్‌ అహ్మద్‌ హత్య.. ప్రతిపక్షాల కుట్రే..!’

గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ హత్య వెనుక ప్రతిపక్షాల కుట్ర దాగి ఉందని ఉత్తర్‌ప్రదేశ్‌ మంత్రి ధరమ్‌పాల్‌ సింగ్‌ ఆరోపించారు. అతీక్‌ తమ రహస్యాలను బయటపెడతాడనే భయంతో అతడిని అంతమొందించాయన్నారు.

Published : 22 Apr 2023 22:54 IST

లఖ్‌నవూ: గ్యాంగ్‌స్టర్‌, మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmad), అతని సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ల హత్యోదంతం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) మంత్రి ధరమ్‌పాల్‌ సింగ్‌ (Dharmpal Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. అతీక్‌ అహ్మద్‌ తమ రహస్యాలను బట్టబయలు చేస్తాడనే భయంతో ప్రతిపక్ష పార్టీలే ఈమేరకు కుట్ర పన్నాయని ఆరోపించారు. ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతీక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌లను గత వారం వైద్య పరీక్షల కోసం పోలీసులు ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చిచంపారు.

పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు చందౌసీకి వచ్చిన యూపీ మంత్రి ధరమ్‌పాల్‌ సింగ్‌ ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘అతీక్‌ హత్య కేసులో ప్రతిపక్షాల పాత్ర ఉందన్నది వాస్తవం. అతడు కొన్ని రహస్యాలు బయటపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అందుకే ప్రతిపక్షాలు అతడిని అంతమొందించాయి’ అని ఆరోపించారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణల క్రమంలో ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ క్రమంలోనే అతీక్‌ సోదరుల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదా హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు