Amartya Sen: నోబెల్‌ విజేత అమర్త్యసేన్‌కు షోకాజ్‌ నోటీసులు

నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ (Amartya Sen)కు విశ్వభారతి విశ్వవిద్యాలయం (ViswaBharati University) మరోసారి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న నివాస భవనాన్ని ఖాళీచేయకపోవడంపై తొలగింపు ఉత్తర్వులు ఎందుకు ఇవ్వకూడదో తెలపాలని అందులో పేర్కొంది.

Published : 19 Mar 2023 22:47 IST

కోల్‌కతా: భూ వ్యవహారంలో నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌కు విశ్వభారతి విశ్వవిద్యాలయం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన  నివాస భవనాన్ని ఖాళీ చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. తొలగింపు ఉత్తర్వులు ఎందుకు జారీ చేయకూడదో తెలపాల్సిందిగా కోరింది. మార్చి 24 లోపు విశ్వవిద్యాలయం అదనపు రిజిస్ట్రార్‌ అశోక్‌ మహతో ఎదుట ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. లేదంటే మార్చి 29 లోపు సంబంధిత ఆధారాలతో తన ప్రతినిధిగా ఎవరినైనా పంపాలని నోటీసుల్లో పేర్కొంది. తాను నివాసం ఉంటున్న భూమి ఆక్రమించుకున్నది కాదంటూ అమర్త్యసేన్‌ రుజువు చేసుకోవాలని తెలిపింది. ‘‘ఒకవేళ నిర్దేశించిన గడువులోగా మీరుగానీ, మీ ప్రతినిధి అదనపు రిజిస్ట్రార్‌ ఎదుట హాజరు కాకపోతే.. కేసును మీరు వదిలివేసినట్లుగా పరిగణిస్తాం’’ అని నోటీసుల్లో పేర్కొంది. అయితే, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమర్త్యసేన్‌ గానీ, ఆయన కుటుంబసభ్యులు గానీ ఈ నోటీసులపై ఇప్పటివరకు స్పందించలేదు.

అమర్త్యసేన్‌ నివాసం ఉంటున్న 1.38 ఎకరాల విస్తీర్ణంలో చట్టపరంగా ఆయన భూమి కేవలం 1.25 ఎకరాలు మాత్రమేనని, మిగతా భూమిని ఆయన ఆక్రమించుకున్నారని విశ్వభారతి విశ్వవిద్యాలయం ఆరోపిస్తోంది. ఆక్రమించిన భూమిని తక్షణమే తిరిగి ఇచ్చేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయితే, శాంతినికేతన్‌ క్యాంపస్‌లో తన అనుభవంలో ఉన్న భూమిని గతంలో మార్కెట్‌ విలువ చెల్లించి తన తండ్రి కొనుగోలు చేశారని అమర్త్యసేన్‌ గతంలో వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఇటీవల పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అమర్త్యసేన్‌ భూ యాజమాన్య హక్కు పత్రాలను స్వయంగా ఆయనకు అందజేశారు. అమర్త్యసేన్‌ భూఆక్రమణకు పాల్పడ్డారనేది నిరాధారమైన ఆరోపణ అని, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారని దీదీ విమర్శించారు. ఈ నేపథ్యంలో విశ్వభారతి విశ్వవిద్యాలయం మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని