LS Polls: 44 రోజుల సుదీర్ఘ ప్రక్రియ.. తొలి ఎన్నికల తర్వాత ఇవే!

ఈసారి లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మొత్తం ఏడు దశల్లో 44 రోజులపాటు సాగనుంది. 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్న ఎన్నికలు ఇవే.

Updated : 16 Mar 2024 21:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న మొదలు జూన్‌ 1 వరకు మొత్తం 44 రోజులపాటు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్‌ నిర్వహించనుంది. స్వతంత్ర భారతంలో 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల (First General Elections) తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్నవి ఇవే. తొలి ఎన్నికలు నాలుగు నెలలకుపైగా సాగాయి. ఏకంగా 68 దశల్లో పోలింగ్‌ నిర్వహించారు. 1980లో కేవలం నాలుగు రోజుల్లోనే ముగియడం గమనార్హం. అత్యంత తక్కువ కాలం ఇదే.

ఈసీ షెడ్యూల్‌ వెలువడినప్పటినుంచి జూన్‌ 4న ఓట్ల లెక్కింపు వరకు ఈసారి ప్రక్రియ మొత్తం 82 రోజులు సాగనుంది. ఇంత సుదీర్ఘ కాలం ఎందుకు నిర్వహిస్తున్నారనేదానిపై ప్రతిపక్షాల నుంచి వస్తోన్న విమర్శలపై సీఈసీ రాజీవ్‌కుమార్‌ బదులిస్తూ.. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, సెలవులు, పండగలు, పరీక్షల వంటివి పరిగణనలోకి తీసుకుని తేదీలు నిర్ణయించినట్లు చెప్పారు. భద్రత బలగాల తరలింపునూ దృష్టిలో ఉంచుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఒకరికి అనుకూలంగా లేదా ఒకరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఏడు దశల్లో ఎన్నికల నిర్వహణపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఏప్రిల్‌ 19 నుంచి లోక్‌సభ పోలింగ్‌

దేశంలో మొదటి సాధారణ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి ఫిబ్రవరి 21, 1952 వరకు సాగింది. ఇప్పటివరకు ఇదే సుదీర్ఘమైనది. 1962 నుంచి 1989 మధ్యకాలంలో నాలుగు రోజుల నుంచి 10 రోజుల మధ్య ఉంది. 1980లో జనవరి 3 నుంచి 6వ తేదీవరకు నాలుగు రోజుల్లోనే ముగిశాయి. 2004లో నాలుగు దశలకు 21 రోజులు పట్టింది. 2009లో ఐదు దశలు నెల పాటు కొనసాగాయి. 2014లో తొమ్మిది దశల్లో ఎన్నికలకు 36 రోజులు పట్టింది. 2019లో 39 రోజుల పాటు ఏడు దశల్లో నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని