Rahul Gandhi: వయనాడ్‌, రాయ్‌బరేలీ.. రాహుల్‌ ఏది వదులుకుంటారు..?

కుటుంబ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీకి రాహుల్‌ పరిమితమవుతారా? లేక వయనాడ్‌ నుంచే కొనసాగుతారా?అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Published : 06 Jun 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన కాంగ్రెస్‌.. అనేక చోట్ల అధికార భాజపాకు గట్టిపోటీ ఇచ్చింది. అగ్రనేత రాహుల్‌ గాంధీ.. వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానానికే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కుటుంబ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీకి పరిమితమవుతారా? లేక ఆపన్నహస్తం అందించిన వయనాడ్‌ నుంచే కొనసాగుతారా?అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

వయనాడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని మూడు జిల్లాల్లో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో వయనాడ్‌ జిల్లాలో రెండు ఎస్టీ రిజర్వుడ్‌ కాగా మలప్పురంలో ఒకటి ఎస్సీ రిజర్వుడ్‌ స్థానం ఉంది. ఇక్కడ ముస్లిం జనాభా కూడా ఎక్కువే. కోజికోడ్‌ జిల్లాలో క్రైస్తవ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పంటలకు మద్దతు ధర, పంట నష్టం, గిరిజనుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాలు వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.

బలమైన ఓటు బ్యాంకు..

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఇక్కడ బలంగా ఉండటంతోపాటు.. జాతీయ స్థాయిలో విపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్‌ అయ్యే అవకాశాలున్నాయంటూ స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు ప్రచారం చేశాయి. చేసిన అభివృద్ధి, స్థానిక సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడం వంటివి ప్రస్తావించిన కాంగ్రెస్‌.. కల్పెట్టాలో ఏప్రిల్‌ 3న రాహుల్‌ నిర్వహించిన రోడ్‌ షో ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. గతంలో మిత్రపక్షంగా ఉన్న ఐయూఎంఎల్‌ జెండాలను ప్రదర్శించడం ఇబ్బందికరంగా మారడంతో.. ఈసారి పార్టీ జెండాలను పక్కనపెట్టి రంగు రంగుల బెలూన్లను ప్రదర్శించి వివాదం లేకుండా చూసుకోవడం వంటివి కలిసొచ్చిన అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రత్యర్థుల విమర్శలు..

భాజపా, వామపక్ష పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి. సీపీఐ నుంచి అన్నీరాజా, భాజపా నుంచి ఆ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ పోటీలో కొనసాగారు. ఈ నియోజకవర్గం గురించి పట్టించుకోవడం లేదని రాహుల్‌ గాంధీపై ప్రత్యర్థులు విమర్శలు చేశారు. ఒకవేళ ఉత్తరాది నుంచి పోటీచేసి గెలిస్తే ఆయన రాయ్‌బరేలీకి వెళ్లిపోతారని కాషాయ పార్టీ ప్రచారం చేసింది. అయినప్పటికీ.. వయనాడ్‌ నుంచి రెండోసారి 3.64లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో రాహుల్‌ విజయం సాధించారు.

కంచుకోటలో ప్రియాంకా..?

రాయ్‌బరేలీ గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా కొనసాగుతోంది. 1951 నుంచి ఈ నియోజకవర్గంలో కేవలం మూడుసార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఫిరోజ్‌ గాంధీ, సోనియాగాంధీ వంటి అగ్రనేతలు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో బరిలో దిగిన రాహుల్‌.. భారీ మెజార్టీ సొంతం చేసుకున్నారు.

రాహుల్‌ రాయ్‌బరేలీని వదులుకుంటే అక్కడ నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యూహంతోనే ఆమెను సార్వత్రిక ఎన్నికల్లో వేరే చోట నుంచి బరిలో దింపలేదనే వాదనా ఉంది. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు పరోక్షంగా ప్రస్తావించిన ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌.. ప్రియాంక దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ మోదీ అసత్యాలను ఎండగడుతున్నందునే ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో ఉంచలేదని అన్నారు. ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని జోస్యం చెప్పడం చూస్తుంటే, అది రాయ్‌బరేలీ కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు