PNS Ghazi: విశాఖ తీరంలో పాక్‌ జలాంతర్గామి గాజీ శకలాలు..!

వైజాగ్‌ తీరంలో పాక్‌ జలాంతర్గామి శకలాలను భారత్‌ అత్యాధునిక సాంకేతికతను వాడి గుర్తించింది. 

Updated : 23 Feb 2024 12:00 IST

ఇంటర్నెట్‌డెస్క్: వైజాగ్‌ తీరంలో పాకిస్థాన్‌ జలాంతర్గామి శకలాలను తాజాగా భారత నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి గుర్తించింది. 1971 ఇండో-పాక్‌ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పీఎన్‌ఎస్‌ గాజీ (PNS Ghazi)కి చెందినవిగా వీటిని తేల్చింది. ఈ విషయాన్ని మన నౌకాదళంలోని సబ్‌మెరైన్‌ రెస్క్యూ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ధ్రువీకరించారు. భారత అమ్ములపొదిలోకి సరికొత్తగా చేరిన ‘ది డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌ (డీఎస్‌ఆర్‌వీ) సాయంతో వీటిని కనుగొన్నారు. ‘‘మేం డీఎస్‌ఆర్‌వీ సాయంతో గాజీ శకలాలను గుర్తించాం. విశాఖ తీరానికి కేవలం కొన్ని నాటికల్‌ మైళ్ల దూరంలోనే సముద్ర గర్భాన ఇవి పడి ఉన్నాయి. యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన నౌకాదళ ఆచారం. అందుకనే ఆ శకలాలను తాకలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. తీరానికి 2-2.5 కిలోమీటర్ల  దూరంలోని సముద్ర జలాల్లో 100 మీటర్ల లోతున ఇవి ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎందుకీ డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీ

సముద్ర గర్భం చాలా కఠినంగా ఉంటుంది. సబ్‌మెరైన్ల ప్రయాణం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. అందుకే జలాల కింద ఉపరితలం ఎలా ఉందో అంచనావేసి.. మన జలాంతర్గాములు ప్రయాణించేందుకు అనువైన మార్గాలను డీఎస్ఆర్‌వీ సాయంతో మ్యాపింగ్‌ చేస్తారు. వైజాగ్‌లో సముద్రం సగటున 16 మీటర్ల లోతు ఉంటుంది. ఇది ఓడలు నిలిపేందుకు అనుకూలం. అంతేకాదు.. జలాంతర్గాములు తీరం సమీపంలోకి వచ్చి వెళ్లేందుకు వీలవుతుంది. ఇలాంటి పరిస్థితులను చూసే 1971లో పీఎన్‌ఎస్‌ గాజీ వైజాగ్‌ తీరానికి చేరి నక్కింది.

2013లో ఐఎన్‌ఎస్‌ సింధ్‌రక్షక్‌ ప్రమాదానికి గురై 13 మంది మరణించడంతో భారత్‌ నేవీ ఆలోచనలో పడింది. ఇటువంటి సమయంలో సిబ్బందిని రక్షించేందుకు వీలుగా 2018లో తొలిసారి డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ప్రమాదానికి గురైన నౌకలు, సబ్‌మెరైన్లను గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు దీనిని వాడాలని నిర్ణయించింది. ప్రస్తుతం మన వద్ద రెండు డీఎస్‌ఆర్‌వీలు వినియోగంలో ఉన్నాయి. ఒకటి తూర్పు, మరొకటి పశ్చిమ తీరంలో వాడుతున్నారు. వీటిని నౌకలు లేదా విమానాల్లో తరలించవచ్చు. ఇటువంటి సాంకేతికత ప్రపంచంలో ప్రస్తుతం భారత్‌ సహా 12 దేశాల వద్ద మాత్రమే ఉంది. సముద్ర గర్భం లోతుకు వెళ్లే కొద్దీ ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. డీఎస్‌ఆర్‌వీకి 650 మీటర్ల దిగువకు వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉంది. వైజాగ్‌లోని హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఇలాంటివి మరో రెండింటిని దేశీయంగా తయారు చేయడంపై భారత్‌ దృష్టిపెట్టింది.

అసలేమిటీ పాక్‌ జలాంతర్గామి..

టెన్చ్‌ శ్రేణికి చెందిన డీజిల్‌ ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్‌ పీఎన్‌ఎస్‌ గాజీ వాస్తవంగా అమెరికా నౌకాదళానికి చెందినది. దీనిని యూఎస్‌ఎస్‌ డయాబ్లోగా వ్యవహరిస్తారు. అమెరికా 1963లో పాక్‌కు లీజుకు ఇచ్చింది. ఇస్లామాబాద్‌ నౌకాదళంలో ఇదే తొలి అటాక్‌ సబ్‌మెరైన్‌. ఇది 1971లో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు రగిలిన వెంటనే.. నవంబర్‌ 14న కరాచీ పోర్టు నుంచి బయల్దేరి దాదాపు 3,000 కి.మీ. పైగా ప్రయాణించి శ్రీలంక మీదుగా వైజాగ్‌ తీరానికి చేరింది. భారత్‌ వద్ద ఉన్న ఏకైక విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ధ్వంసం చేయాలన్నదే దాని వ్యూహం. దాని ఎత్తుగడను ముందే పసిగట్టిన మన నేవీ విక్రాంత్‌ను అండమాన్‌ దీవుల వద్దకు తరలించింది. ఆ స్థానంలో వైజాగ్‌ తీరం నుంచి డెకాయ్‌గా ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ను పంపారు. అది విమానవాహక నౌక వలే భారీ సిగ్నల్స్‌ వదలడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో విక్రాంత్‌లోని సిబ్బందిలా ఒకరు తన జబ్బుపడిన తల్లికి టెలిగ్రాం పంపినట్లుగా కావాలనే భద్రతా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. దీనిని గాజీ పసిగట్టింది. రాజ్‌పుత్‌నే విక్రాంత్‌గా భ్రమించి దాడికి సిద్ధమైంది. డిసెంబర్‌ 3-4 తేదీల అర్ధరాత్రి సముద్రంలో అలజడిని రాజ్‌పుత్‌ గుర్తించింది. దానికి కారణం సబ్‌మెరైన్‌గా నిర్ధరించుకొంది. అనంతరం అక్కడ రెండు ఛార్జెస్‌ను నీటిలోకి వదిలింది. అదే సమయంలో జలాల్లో భారీ పేలుడు జరిగి గాజీ మునిగిపోయింది. దీంతో దాదాపు 92 మంది పాక్‌ సిబ్బంది చనిపోయారు. పేలుడు జరిగిన సమయం.. దాని శకలాల నుంచి సేకరించిన గడియారం ఆగిపోయిన వేళ ఒకటే కావడం విశేషం. ఇది ఆ దేశ నేవీకి కోలుకోలేని దెబ్బగా మారింది. ఆ జలాంతర్గామి శకలాలు ఇప్పటికీ వైజాగ్‌ సమీపంలోని సముద్రం అడుగున కూరుకుపోయి ఉన్నాయి. పాక్‌ మాత్రం అంతర్గత పేలుడు వల్లే ఇది మునిగిపోయిందని చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని