Fadnavis: ‘ఉద్ధవ్‌ జీ.. మీరు మావైపు రావచ్చు’: ఫడణవీస్‌ ఆఫర్‌

Eenadu icon
By National News Team Published : 17 Jul 2025 00:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షంలో కూర్చునేందుకు భాజపాకు అవకాశం లేదని, కానీ.. మీరు మాత్రం అధికార పక్షం వైపు రావచ్చని చమత్కరించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత అంబాదాస్‌ దాన్వే వీడ్కోలు కార్యక్రమంలో సీఎం ఫడణవీస్‌ ఈ విధంగా స్పందించారు.

‘‘ఉద్ధవ్‌ జీ.. 2029 వరకు ప్రభుత్వం మారే ఆస్కారం లేదు. అవతలి వైపు (ప్రతిపక్షం) మేం వచ్చే అవకాశం లేదు. కానీ.. మీరు ఇటువైపు వచ్చేందుకు స్కోప్‌ ఉంది. దాని గురించి ఆలోచించవచ్చు. మనం దీన్ని భిన్నంగా తీసుకుందాం’’ అని ఫడణవీస్‌ పేర్కొన్నారు. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే కూడా పక్కనే ఉండటం గమనార్హం. ఫడణవీస్‌, ఏక్‌నాథ్‌ శిందేల మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్‌ నడుస్తోందంటూ వార్తలు వస్తున్న వేళ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వంపై ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర స్పెషల్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ బిల్లు ఆమోదం పొందడంపై స్పందిస్తూ.. దీన్ని ‘భాజపా సెక్యూరిటీ బిల్లు’గా పేరు మార్చాలంటూ విమర్శలు గుప్పించారు. సామాన్యులను జైల్లో పెట్టేందుకే ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందని ఆరోపించారు.

ఇదిలా ఉంటే, చీలికకు ముందు భాజపాతో సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన శివసేన.. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. అటు ఉద్ధవ్‌ నుంచి వీడిపోయిన ఏక్‌నాథ్‌ శిందే.. భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొంతకాలం శిందే ముఖ్యమంత్రి, డిప్యూటీగా ఫడణవీస్‌లు కొనసాగారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారం చేజిక్కించుకోగా.. ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా, డిప్యూటీగా శిందే బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తుందనే వార్తలు వెలువడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని