12th Fail: ‘12th ఫెయిల్‌’ మరో ఘనత.. 23 ఏళ్ల రికార్డు బ్రేక్‌..

‘12th ఫెయిల్‌’ మరో మైలు రాయిని చేరుకుంది. దీంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.

Published : 13 Apr 2024 19:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది ‘12th ఫెయిల్‌’ (12th Fail). విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటికే పలు రికార్డులను సాధించింది. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. 25 వారాలుగా థియేటర్లలో విజయవంతంగా రన్‌ అవుతూ.. 23 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసింది. దీంతో ఆనందం వ్యక్తంచేస్తూ దర్శకుడు పోస్ట్‌ పెట్టారు. 

‘‘ఈ హిట్‌ చిత్రం విడుదలై 25 వారాలు పూర్తయింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. 23 ఏళ్ల తర్వాత ఈ మైలురాయిని సాధించిన తొలి చిత్రంగా ‘12th ఫెయిల్‌’ నిలిచింది. మా కలను నిజం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది’’ అని పేర్కొన్నారు. దీనిపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ‘గొప్ప సినిమా’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరోవైపు ఈ మూవీ చైనాలో విడుదలకు సిద్ధమవుతుంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ‘మంచి కథకు సరిహద్దులు దాటి ఆదరణ లభిస్తుందని నమ్ముతాను. చైనాలో విడుదలవుతుందంటే.. కొత్త ప్రేక్షకులకు చేరుకోవడం మాత్రమే కాదు.. ఈ కథ మరికొందరిలో స్ఫూర్తి నింపనుందని అర్థం. విడుదలైన ప్రతీ ప్రాంతంలో దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. చైనీస్‌ ప్రేక్షకులు దీనితో ఎలా కనెక్ట్‌ అవుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని రాసుకొచ్చారు. 
ఇక ఈ చిత్రం తర్వాత తన కెరీర్‌ మారిందన్నారు హీరో విక్రాంత్‌ మస్సే. ‘ఈ సినిమాతో నేను విజయాన్ని చూశాను. ఆరు నెలల క్రితం పరిస్థితి వేరేగా ఉండేది. ఇప్పుడు వచ్చిన గుర్తింపుని నేను ఎప్పటికీ కొనసాగించాలనుకుంటున్నా. ప్రేక్షకులు వాళ్ల కష్టార్జితంతో థియేటర్లకు వెళ్లి చూస్తారు. వాళ్లకు వినోదాన్ని పంచడం నటీనటుల బాధ్యత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని