Tollywood: అంచనాలు ఎన్నో.. అందుకున్నవి కొన్నే

2024 క్యాలెండర్‌లో అప్పుడే ముచ్చటగా మూడు నెలలు పూర్తయ్యాయి. ఒకరకంగా తెలుగు చిత్రసీమ త్రైమాసిక పరీక్షలు పూర్తి చేసుకున్నట్లే. ఈ మూడు నెలల్లో బాక్సాఫీస్‌ ముందు బోలెడన్ని చిత్రాలు అదృష్టం పరీక్షించుకున్నాయి.

Updated : 01 Apr 2024 11:48 IST

తెలుగు చిత్రసీమ మూడు నెలల ముచ్చట

2024 క్యాలెండర్‌లో అప్పుడే ముచ్చటగా మూడు నెలలు పూర్తయ్యాయి. ఒకరకంగా తెలుగు చిత్రసీమ త్రైమాసిక పరీక్షలు పూర్తి చేసుకున్నట్లే. ఈ మూడు నెలల్లో బాక్సాఫీస్‌ ముందు బోలెడన్ని చిత్రాలు అదృష్టం పరీక్షించుకున్నాయి. అందులో అగ్ర తారలు నటించిన భారీ సినిమాలతో పాటు పరిమిత వ్యయంతో రూపొందిన యువతారల చిత్రాలు, అనువాదాలు అన్నీ ఉన్నాయి. అయితే వాటిలో విజయ ఢంకా మోగించినవి కొన్నైతే... అంచనాలు అందుకోలేక చతికిలపడినవి ఎన్నో. మరి ఈ మూడు నెలల తెలుగు చిత్రసీమ ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌ను ఓసారి పరిశీలిస్తే...

‘సర్కారు నౌకరి’ అనే చిన్న చిత్రంతో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది తెలుగు చిత్రసీమ. జనవరి 1న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి చేదు ఫలితాన్నే అందుకుంది. ఆ మరుసటి వారం ‘ప్రేమకథ’, ‘రాఘవ రెడ్డి’, ‘డబుల్‌ ఇంజిన్‌’.. ఇలా అరడజను వరకు చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ ముందుకొచ్చాయి. అన్నీ పరాజయాల్నే అందుకున్నాయి. ఇక ఆ తర్వాత నుంచి సంక్రాంతి సినిమాల హంగామా మొదలైంది. ఈసారి తెలుగులో పండగ చిత్రాల మధ్య గట్టి పోటీ కనిపించింది. జనవరి 12న మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’, తేజ సజ్జా - ప్రశాంత్‌ వర్మల ‘హను-మాన్‌’ ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో చిన్న చిత్రంగా విడుదలైన ‘హను-మాన్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. నిజానికి దీనికి ఆరంభంలో తెలుగు రాష్ట్రాల్లో కావాల్సినన్ని థియేటర్లు దక్కకున్నా.. మెల్లగా మౌత్‌ టాక్‌తో స్క్రీన్లను అంతకంతకూ పెంచుకుంటూ పోయింది.ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులు సృష్టించింది. ఇక మహేశ్‌ చిత్రానికి మంచి ఆరంభ వసూళ్లు దక్కినప్పటికీ.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కడంతో ఆ తర్వాత జోరు కొనసాగించలేకపోయింది.

13న వెంకటేశ్‌ తన 75వ సినిమా ‘సైంధవ్‌’తో ప్రేక్షకుల్ని పలకరించారు. విభిన్నమైన భావోద్వేగభరిత యాక్షన్‌ డ్రామాగా ముస్తాబైన ఈ సినిమా సినీప్రియుల్ని ఏమాత్రం మెప్పించలేక పోయింది. దీంతో ఈ సంక్రాంతి చిత్రాల్లో తక్కువ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ముగ్గుల పండగ రోజున ‘నా సామిరంగ’ అంటూ థియేటర్లలో సందడి చేశారు నాగార్జున. సంక్రాంతి వైబ్స్‌తో నిండిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది. ఈ చిత్రంతోనే నృత్య దర్శకుడు విజయ్‌ బిన్ని డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. పండగ సందడి ముగిసిన మరుసటి వారం బాక్సాఫీస్‌ ముందు కొత్త విడుదలలు ఏమీ కనిపించలేదు. నెలాఖరున రిపబ్లిక్‌ డే బరిలో ధనుష్‌ ‘కెప్టెన్‌ మిల్లర్‌’తో అదృష్టం పరీక్షించుకున్నారు. కానీ, అది ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిజానికి దానితో పాటు అదే రోజున శివ కార్తికేయన్‌ ‘అయలాన్‌’ కూడా థియేటర్స్‌లోకి రావాల్సి ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల ఆఖరి నిమిషంలో వాయిదా పడింది.

ఫిబ్రవరి కలిసి రాలేదు!

సాధారణంగా ఫిబ్రవరి చిత్రసీమకు అన్‌సీజన్‌. విద్యార్థులకు పరీక్షల సీజన్‌ కావడంతో పెద్ద చిత్రాలు ఈనెలలో బరిలో దిగేందుకు వెనకాడుతుంటాయి. కానీ, కొన్నేళ్లుగా ఈ అన్‌సీజన్‌లోనే అదిరే విజయాల్ని సొంతం చేసుకుంటూ వస్తోంది తెలుగు చిత్రసీమ. ‘భీమ్లా నాయక్‌’, ‘ఉప్పెన’, ‘జాంబిరెడ్డి’, ‘నాంది’.. ఇవన్నీ గత రెండేళ్లలో ఫిబ్రవరిలో దక్కిన విజయాలే. కానీ, ఈ ఏడాది ఆ ఆనవాయితీ కొనసాగలేదు. ఈసారి ఫిబ్రవరి బరిలో ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ విజయం దక్కించుకోలేదు. తొలి వారం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘కిస్మత్‌’, ‘హ్యాపీ ఎండింగ్‌’, ‘బూట్‌కట్‌ బాలరాజు’.. ఇలా దాదాపు అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కానీ, వాటిలో ఏదీ చెప్పుకోదగ్గ స్థాయిలో సత్తా చాటలేదు. సుహాస్‌ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాకి మంచి ప్రయత్నంగా పేరొచ్చినప్పటికీ అది వసూళ్లను ప్రభావితం చేయలేకపోయింది.

ఫిబ్రవరి రెండో వారంలో రవితేజ ‘ఈగల్‌’తో పాటు రజనీకాంత్‌ ప్రత్యేక పాత్రలో నటించిన అనువాద చిత్రం ‘లాల్‌ సలాం’ బాక్సాఫీస్‌ బరిలో పోటీ పడ్డాయి. వాటిలో ‘లాల్‌ సలాం’ దారుణ పరాజయాన్ని సొంతం చేసుకోగా.. ‘ఈగల్‌’ ఫర్వాలేదనిపించింది. ఆ మరుసటి వారం సందీప్‌ కిషన్‌ ‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకుల్ని పలకరించారు. దీనికి మంచి టాక్‌ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా నిరుత్సాహ పరిచింది. మూడో వారంలో మమ్ముట్టి నటించిన అనువాద చిత్రం ‘భ్రమయుగం’తో పాటు ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’, ‘రాజధాని ఫైల్స్‌’, ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ తదితర చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘భ్రమయుగం’కు విమర్శకుల ప్రశంసలు దక్కగా.. మిగిలినవన్నీ చేదు ఫలితాల్నే అందుకున్నాయి.

మార్చిలో చిన్న చిత్రాల మెరుపులు..

తెలుగు చిత్రసీమలో వేసవి సీజన్‌ మార్చి నుంచే మొదలైపోతుంది. ఈనెల నుంచే విద్యార్థులకు సెలవులు షురూ అవడంతో అగ్రతారల చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు వరుస కట్టడం ఆనవాయితీగా కనిపిస్తుంటుంది. కానీ, ఈసారి అగ్ర నాయకుల సందడంతా సెట్లకే పరిమితమవడంతో చిన్న, మీడియం రేంజ్‌ సినిమాల జోరు కనిపించింది. మార్చి తొలి వారం వరుణ్‌ తేజ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో పాటు ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’, ‘చారి 111’, ‘ఇంటి నెంబర్‌ 13’ తదితర సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కానీ, వాటిలో ఏ ఒక్కటీ ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు. నిజానికి వరుణ్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రచార చిత్రాలతో అందరిలో అంచనాలు పెంచినప్పటికీ.. తెరపై ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ మరుసటి వారం గోపీచంద్‌ ‘భీమా’తో.. విష్వక్‌ సేన్‌ ‘గామి’తో బాక్సాఫీస్‌ బరిలో తలపడ్డారు.

వీటిలో కొత్త దర్శకుడు విద్యాధర్‌ తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘గామి’కి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కడం విశేషం. ఇక వీటితోపాటే అదేవారంలో థియేటర్లలోకి వచ్చిన మలయాళ అనువాద చిత్రం ‘ప్రేమలు’ సైతం సినీప్రియుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తనయుడు కార్తికేయ డిస్ట్రిబ్యూటర్‌గా మారడం విశేషం. మార్చి మూడో వారంలో ‘రజాకార్‌’, ‘లంబసింగి’, ‘షరతులు వర్తిస్తాయి’, ‘వెయ్‌ దరువెయ్‌’.. ఇలా అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలోకి వరుస కట్టాయి. కానీ, వాటిలో ఏదీ హిట్టు మాట వినిపించలేకపోయింది. గతేడాది ‘సామజవరగమన’తో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఆయన ఈ మార్చిలో ‘ఓం భీమ్‌ బుష్‌’ అంటూ మరోసారి వినోదాల జల్లుల్లో తడిపేశారు. విభిన్నమైన కామెడీ హారర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలతో కలిసి శ్రీవిష్ణు చేసిన అల్లరి ప్రేక్షకుల మోముల్లో నవ్వులు పూయించింది.

ప్రస్తుతం ఈ నవ్వుల యాత్రనే ‘టిల్లు స్క్వేర్‌’తో థియేటర్లలో విజయవంతంగా కొనసాగిస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. మల్లిక్‌ రామ్‌ తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సినీప్రియుల్ని మెప్పించి మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘టిల్లు 3’ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక దీనికి ఓరోజు ముందే థియేటర్లలోకి వచ్చిన మలయాళ అనువాద చిత్రం ‘ఆడు జీవితం’ కూడా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని బ్లెస్సీ తెరకెక్కించారు. మరి ఇది తెలుగులో ఏ స్థాయి వసూళ్లు రాబడుతుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. రానున్న ఏప్రిల్‌, మే నెలల్లోనూ బాక్సాఫీస్‌ ముందు చిన్న, మీడియం రేంజ్‌ సినిమాల సందడే ఎక్కువ కనిపించనుంది. వీటిలో కొన్నైనా ‘ఓం భీమ్‌ బుష్‌’, ‘టిల్లు స్క్వేర్‌’లా మెరుపులు మెరిపించగలిగితే ఈ వేసవి సీజన్‌కు మంచి ముగింపు దొరికినట్లు అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని