Manjummel Boys: ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిర్మాతలపై చీటింగ్‌ కేసు

‘మంజుమ్మల్‌ బాయ్స్‌’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది.

Updated : 24 Apr 2024 14:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ (Manjummel Boys) నిర్మాతలపై కేసు నమోదు అయ్యింది. ఎర్నాకుళం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం చిత్ర నిర్మాతలపై పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. చిత్ర నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ తనని మోసం చేశారంటూ కొన్ని రోజుల క్రితం సిరాజ్‌ వలియతార న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో 40 శాతం వాటా తనకు ఇస్తానని నమ్మబలికారని.. దాంతో తాను రూ.7 కోట్లు పెట్టుబడిగా పెట్టానని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తీరా, సినిమా విజయం సాధించాక ముఖం చాటేశారని.. లాభాల మాట పక్కనపెట్టి తాను ఖర్చు పెట్టిన మొత్తాన్ని కూడా తిరిగి ఇవ్వలేదని తెలిపాడు. విచారణ అనంతరం చిత్ర నిర్మాతలపై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా ఇది రూపుదిద్దుకుంది. 2006లో జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని చిదంబరం దీనిని తెరకెక్కించారు. ఇప్పటివరకూ ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. త్వరలో ఇది డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని