Aadujeevitham: 25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.

Updated : 21 Apr 2024 13:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). విడుదలకు ముందే విశేష ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టినట్లు చిత్రబృందం పేర్కొంది. దీంతో మలయాళంలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ చిత్రాల జాబితాలో ఇది చేరింది. దీనిపై నటుడు పృథ్వీరాజ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ది గోట్‌ లైఫ్‌ కొత్త శిఖరాలను అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ఈ విజయంపై పలువురు సినీ ప్రియులు స్పందిస్తూ.. ‘‘మంచి కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనం’’ అని కామెంట్‌ చేస్తున్నారు.

కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్‌ ‘గోట్‌ డేస్‌’ను రచించారు. 2008లో అత్య‌ధికంగా అమ్ముడైన మ‌ల‌యాళీ న‌వ‌ల ఇదే. దీనిని చిత్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో బ్లెస్సీ హక్కులు కొనుగోలు చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు శ్రమించి ‘ఆడు జీవితం’ను తెరకెక్కించారు. నజీబ్‌ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ 31 కిలోల బరువు తగ్గారు. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణలో 72 గంటలపాటు భోజనం లేకుండా కేవలం మంచి నీళ్లు, కొద్దిగా బ్లాక్‌ కాఫీ మాత్రమే తాగి నటించారు.

ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళీ చిత్రాల జాబితాలో టాప్‌-1లో నిలిచింది. ఇప్పటివరకూ ఈ చిత్రం రూ.230 కోట్లు వసూలు చేసింది. ఇంకా పలు చోట్ల ఈ మూవీని ప్రదర్శిస్తున్నారు. దీని తర్వాత ‘2018’ (రూ.176 కోట్లు), ‘పులి మురుగన్‌’ రూ.150 కోట్లు, ప్రేమలు రూ.136 కోట్ల మేరకు వసూళ్లు సాధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని