ఏడాదిన్నర పాటు కెమెరా ముందుకు రాను.. ప్రముఖ హీరో ప్రకటన

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుని అభిమానులకు షాకిచ్చారు. కొంతకాలం నటనకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. 

Updated : 16 Nov 2022 16:09 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌లోనే కాదు అన్ని ప్రాంతాల్లో అభిమానుల్ని సంపాదించుకున్న హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan). 35 సంవత్సరాలుగా విభిన్న పాత్రలతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల ‘లాల్‌ సింగ్‌ చడ్డా’(Laal Singh Chaddha)తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత చాలా రోజులకు మీడియా ముందుకు వచ్చిన ఈ హీరో కొన్ని షాకింగ్‌ విషయాలు చెప్పారు. నటనకు కొంతకాలం విరామం ఇవ్వనున్నట్లు తెలిపారు.

‘‘నేను నటించడం మొదలుపెట్టి 35 సంవత్సరాలైంది. ఇన్ని ఏళ్లలో ఏదో నష్టపోయానని అనిపిస్తోంది. అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ, పిల్లలతో గడపాలనుకుంటున్నా. ఇన్నేళ్లు నిరంతరం పని గురించే ఆలోచించాను. అది సరైంది కాదనిపిస్తోంది. అందుకే ఏడాదిన్నర పాటు కెమెరా ముందుకు రాకూడదని అనుకుంటున్నా’’ అంటూ ఆయన అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక ఆమిర్‌ నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్స్‌. ఈ సినిమా గురించి స్పష్టత ఇస్తూ..‘‘ఛాంపియన్స్ సినిమాకు నేను హీరోను మాత్రమే కాదు.. నిర్మాతను కూడా. కాబట్టి నేను నటించక పోయినా నిర్మాతగా ఉంటాను. మరొక టాప్‌ హీరోను ఈ సినిమాలో నటించమని కోరతాను. ప్రస్తుతానికి నేను నా కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలి’’ అని సమాధానం చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని