Aayush Sharma: డబ్బు కోసమే సల్మాన్‌ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్‌ శర్మ

బాలీవుడ్‌ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్‌ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్‌ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్‌’. దీని ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Updated : 22 Apr 2024 15:51 IST

ముంబయి: తన తదుపరి చిత్రం ‘రుస్లాన్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నటుడు ఆయుష్‌ శర్మ. ఇందులోభాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్‌ పరంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన తెలిపారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తొలి అవకాశం అంత సులభంగా రాలేదన్నారు.

‘‘సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితాఖాన్‌ను వివాహం చేసుకున్నప్పుడు.. నేనొక వ్యాపారవేత్తనని వార్తలు వచ్చాయి. వ్యాపారరంగంలో నాకు అనుభవం లేదు. మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా నాన్న రాజకీయ నాయకుడు. సినిమాల్లో నటించాలనే ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. దాదాపు 300 చిత్రాలకు ఆడిషన్స్‌ ఇచ్చా. ఆ సమయంలో అర్పితాఖాన్‌తో పరిచయమైంది. మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. నేను ఎలాంటి వాడిని? నా కుటుంబ నేపథ్యం ఏంటి? ఇలా అన్ని విషయాలు ఆమె కుటుంబానికి తెలుసు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే మా పెళ్లి జరిగింది. మా పెళ్లప్పుడు ఎంతోమంది విమర్శించారు. డబ్బు, నటుడిగా ఎదగడం కోసమే ఆమెను వివాహం చేసుకుంటున్నానన్నారు. ఆ మాటలు నన్నెంతో బాధించాయి. మరీ ముఖ్యంగా వజ్రాలు పొదిగిన షేర్వానీ, అత్యంత ఖరీదైన బెంట్లీ కారును కట్న కానుకలుగా ఇచ్చారని మాట్లాడుకున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. డబ్బుపై నాకు ఆశ లేదు. నా తండ్రి నాకు సరిపడా ఆస్తులు ఇచ్చాడు. అవి చాలు’’ అని ఆయన అన్నారు.

సల్మాన్‌ఖాన్‌ తనకు గురువు లాంటి వ్యక్తి అని ఆయుశ్‌ తెలిపారు. తాను సినిమాల్లో నటించాలనుకోవడం లేదనే విషయాన్ని పెళ్లికి ముందే ఆయనకు చెప్పానన్నారు. ‘‘పెళ్లికి కొన్ని రోజుల ముందు సల్మాన్‌తో మాట్లాడా. వరుస ఆడిషన్స్‌ ఇచ్చి అవకాశాలు రాక విసిగిపోయా. కాబట్టి, సినిమాల్లో నటించాలని లేదని ఆయనతో చెప్పా. నా బాధను అర్థం చేసుకున్న ఆయన నాకు కావాల్సిన శిక్షణ ఇచ్చారు. నేను హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘లవ్‌ యాత్రి’కి నిర్మాతగా వ్యవహరించారు’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని