Abhishek Agarwal: ఓ నిర్మాత ఇంతకంటే ఏం కోరుకుంటాడు?

‘‘ఇప్పుడున్నది యువ భారతం. మనదైన చరిత్ర నవతరానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. వెలుగులోకి రాని హీరోల కథలు ఎన్నో ఉన్నాయి. వాటిపై పక్కాగా పరిశోధన చేసి తెరపైకి తీసుకు రావాలన్నదే మా ప్రయత్నం.

Updated : 19 Oct 2023 12:34 IST

‘‘ఇప్పుడున్నది యువ భారతం. మనదైన చరిత్ర నవతరానికి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. వెలుగులోకి రాని హీరోల కథలు ఎన్నో ఉన్నాయి. వాటిపై పక్కాగా పరిశోధన చేసి తెరపైకి తీసుకు రావాలన్నదే మా ప్రయత్నం. ఈ సారి ఓ దొంగ కథతో మేం సినిమాని ఎందుకు తీశామనేది తెరపై చూసి తెలుసుకోవల్సిందే’’ అన్నారు అభిషేక్‌ అగర్వాల్‌. ‘కార్తికేయ 2’, ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ లాంటి పాన్‌ ఇండియా చిత్రాల్ని రూపొందించిన నిర్మాత ఈయన. ఇటీవల రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అభిషేక్‌ అగర్వాల్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘కథా బలం ఉన్న సినిమాలు తీయడమే మా సంస్థ ఉద్దేశం. ఇప్పటిదాకా మా సంస్థ నుంచి వచ్చిన, ఇకపైన రానున్న సినిమాల్లో ‘టైగర్‌ నాగేశ్వరరావు’  ఎప్పటికీ నాకు ఇష్టమైన ఓ చిత్రంగా నిలుస్తుంది. జీవిత కథా చిత్రాలనగానే నాయకులు, క్రీడాకారులు, ఇతరత్రా ప్రముఖులే గుర్తొస్తారు. కానీ ఓ దొంగ కథని ఎందుకు సినిమాగా తీశామన్నదే అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. ఓ మనిషి దొంగ ఎందుకయ్యాడు? దొంగ అయ్యాక ఏం చేశాడనే విషయాలు ఇందులో కీలకం. ఈ కథ అనుకున్నప్పుడే టైగర్‌ నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని సంప్రదించి, వారి అనుమతి తీసుకుని స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. ఓ మంచి సినిమాని తీసుకు రావాలని సమష్టిగా కృషి చేశాం. మూడేళ్లపాటు  ఈ సినిమా కోసం ప్రయాణం చేశాం. అందుకే విడుదలకి ముందస్తు వేడుకలోన భావోద్వేగానికి గురయ్యా’’.

  • ‘‘మేం ఈ కథని ఎంతగా నమ్మామో, కథానాయకుడు రవితేజ కూడా అంతే నమ్మారు. పోరాట ఘట్టాల్లో నటిస్తూ చేతికి గాయమైనప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా కష్టపడ్డారు. వంశీ ఓ దర్శకుడిలా కాకుండా, నిర్మాతగానూ బాధ్యతలు తీసుకుని పనిచేశాడు. అన్ని భాషల్లోనూ చెప్పాల్సిన కథ ఇది. అందుకే పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళుతున్నాం.
  • అనుపమ్‌ ఖేర్‌ సర్‌ నన్నొక బిడ్డలా చూస్తారు. ఏదైనా ఓ పాత్ర చేయాలని అడిగితే ఆయన మరో మాట లేకుండా ముందుకొస్తారు. రేణుదేశాయ్‌ ఓ గొప్ప పాత్రలో కనిపిస్తారు’’.
  • ‘‘తొలి అడుగుల్లోనే ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’  చిత్రాన్ని నిర్మించాం. ఆ చిత్రానికిగానూ దిల్లీలో మా బృందం  జాతీయ పురస్కారం అందుకుంటున్నప్పుడు చూసి కన్నీళ్లొచ్చాయి. ఇప్పుడిప్పుడే ప్రయాణం ప్రారంభించిన ఓ నిర్మాత ఇంతకంటే ఏం కోరుకుంటాడు? ఏ ఒక్క వర్గాన్నీ బలపరిచేలా సినిమా తీయాలనుకోను. దేశం కోసం, ధర్మం కోసం నిలబడటమే మా సిద్ధాంతం. అందుకు తగ్గట్టే మా సంస్థ నుంచి సినిమాలు వస్తుంటాయి. మరో బయోపిక్‌ కోసం రంగం సిద్ధం చేస్తున్నాం.  అది కూడా ఆసక్తికరమైన ప్రాజెక్టే. ప్రస్తుతం పరిశోధన కొనసాగుతోంది’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని