Ashish Vidyarthi: ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి రెండో పెళ్లి.. వధువు ఎవరంటే?

జాతీయ అవార్డు గ్రహీత ఆశిష్‌ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన ఎవరిని వివాహమాడారంటే?

Published : 26 May 2023 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి (Ashish Vidyarthi) 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. గువాహటికి చెందిన ఫ్యాషన్‌ ఎంట్రప్రెన్యూర్‌ రుపాలీ బరూవా (Rupali Barua)ను వివాహమాడారు. ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరు రిజిస్టర్‌ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుపాలీని పెళ్లి చేసుకోవడం ఓ అద్భుతమైన ఫీలింగ్‌ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. వేడుకల ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా అవి వైరల్‌ అయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, ఫ్యాన్స్‌ ఈ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 20 ఏళ్ల కిత్రం.. నటి శాకుంతల బరూవా తనయ రాజోషిని పెళ్లి చేసుకున్నారు ఆశిష్‌. ఈ దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. పలు కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఆశిష్‌- రుపాలీ మధ్య కొంతకాలం క్రితం మొదలైన స్నేహం.. ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కించింది. కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్‌ స్టోర్‌లో రుపాలీకి భాగస్వామ్యం ఉందని సమాచారం.

దిల్లీలో పుట్టి, పెరిగిన ఆశిష్‌ 1991లో ‘కాల్‌ సంధ్య’ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ‘పాపే నా ప్రాణం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రతినాయక పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గాను తనదైన ముద్ర వేశారు. ‘గుడుంబా శంకర్’, ‘అతిథి’, ‘తులసి’, ‘పోకిరి’, ‘లక్ష్యం’, ‘అలా మొదలైంది’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇటీవల విడుదలైన ‘రైటర్‌ పద్మభూషణ్‌’ సినిమాలో హీరో తండ్రిగా కనిపించి, అలరించారు. ‘రానా నాయుడు’ వంటి వెబ్‌సిరీస్‌లోనూ ఆయన సందడి చేశారు. కన్నడ, తమిళ్‌, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్‌ చిత్రాల్లోనూ నటించిన ఆయన కెరీర్‌ ప్రారంభంలోనే (1995) జాతీయ అవార్డు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని