Atharva: ఆ ప్రశ్న నుంచి పుట్టిందే అథర్వ

‘‘ఎలాంటి ఆధారాలు లేని ఓ క్లిష్టమైన కేసు ఎలా పరిష్కారమైందనే ఆసక్తికరమైన కథతోనే ‘అథర్వ’ తెరకెక్కింద’’న్నారు కార్తీక్‌రాజు. పోలీసు అధికారి కావాలనే కోరిక ఉన్నా, కాలేకపోయిన ఓ యువకుడిగా తాను కనిపిస్తానన్నారు.

Updated : 30 Nov 2023 06:38 IST

‘‘ఎలాంటి ఆధారాలు లేని ఓ క్లిష్టమైన కేసు ఎలా పరిష్కారమైందనే ఆసక్తికరమైన కథతోనే ‘అథర్వ’ తెరకెక్కింద’’న్నారు కార్తీక్‌రాజు. పోలీసు అధికారి కావాలనే కోరిక ఉన్నా, కాలేకపోయిన ఓ యువకుడిగా తాను కనిపిస్తానన్నారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వంలో... కార్తీక్‌రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా నాయకానాయికలుగా రూపొందిన చిత్రమిది. పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుభాష్‌ నూతలపాటి నిర్మించారు. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కథానాయకుడు కార్తీక్‌రాజు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘నేర నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలు దాదాపుగా హత్య లేదంటే దోపిడీల చుట్టూనే సాగుతుంటాయి. ఎవరు చేశారనే ఉత్కంఠ చుట్టూ కథ, కథనాల్ని అల్లుతుంటారు. అసలు ఆధారాలే లేకపోతే ఏమిటనే ప్రశ్న నుంచి పుట్టిన కథే మా చిత్రం. ఈ కేసుని క్లూస్‌ టీమ్‌లో పనిచేసే ఓ యువకుడు ఎలా ఛేదించాడనేది కీలకం. ఇందులో నేను బయోమెట్రిక్‌ విశ్లేషకుడిగా కనిపిస్తా. పోలీసుల కంటే ఎక్కువగా పరిశోధన చేసి అనుకున్నది ఎలా సాధించానన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే’’.

  • ‘‘దర్శకుడు ఎంతో పరిశోధన చేసి ఈ కథని రాశాడు. పది నిమిషాల్లో కథ చెబుతానన్న ఆయన, మూడు గంటలపాటు ఈ సినిమా గురించి చెప్పాడు. అప్పుడే ఇదెంత ఆసక్తికరంగా ఉంటుందో ఊహించా. క్లూస్‌ టీం విభాగానికి చెందిన కొందరు అధికారులు ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు. ఇలాంటి కథల్లో నటిస్తున్నప్పుడు హావభావాలు కీలకం. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని నటించా. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమానే అయినా ఇందులో మంచి పాటలు, ఇతరత్రా వాణిజ్యాంశాలు కూడా ఉంటాయి. నిర్మాతలు శ్రీనివాస్‌, సుభాష్‌ ఏ విషయంలోనూ రాజీపడలేదు’’.
  • ‘‘కుటుంబసమేతంగా చూడదగిన వినోదాత్మక చిత్రాలు చేయాలని ఉంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ తర్వాత చాలా అవకాశాలు వచ్చినా.. కరోనాతో విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆచితూచి కథల్ని ఎంచుకుంటున్నా. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీలో ఒకటి, తమిళంలో మరో చిత్రం చేశా. త్వరలోనే కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తున్నాం’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు