Nikhil Siddhartha: రైట్‌ వింగ్‌, లెఫ్ట్‌ వింగ్‌ కలవాలనేదే నా ప్రయత్నం: నిఖిల్‌

నిఖిల్‌ హీరోగా గ్యారీ బీహెచ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం.. ‘స్పై’. ఈ ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు.

Updated : 26 Jun 2023 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల ద్వారా లెఫ్ట్‌ వింగ్‌, రైట్‌ వింగ్‌ కలవాలనేదే తన ప్రయత్నమని హీరో నిఖిల్‌ (Nikhil Siddhartha) తెలిపారు. సినిమా కథలు తాను రాయడం లేదని, తన దగ్గరకు వచ్చిన వాటిని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నానని స్పష్టం చేశారు. తన తాజా చిత్రం ‘స్పై’ (Spy) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘రైట్‌ వింగ్‌కి సంబంధించి మీరు వరుస సినిమాలు చేస్తున్నారని కొందరు అనుకుంటున్నారు’ అనే ప్రస్తావనరాగా నిఖిల్‌ స్పందించారు.

‘‘నా గత చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చూసేందుకు ఓ థియేటర్‌కి వెళ్లా. అక్కడ పలు ముస్లిం కుటుంబాలు చిత్రాన్ని ఆస్వాదించాయి. కొందరు మాత్రమే రాజకీయ కోణాన్ని ఆపాదిస్తుంటారు. అది వారి విజ్ఞత. ఇటీవల ప్రకటించిన ‘స్వయంభూ’ (Swayambhu) సినిమా విషయంలోనూ ఇలాంటి అపోహ కలగొచ్చు. ఎందుకంటే.. ఈ సినిమాకి సంబంధించి మేం రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాల్లో రాజదండం కనిపిస్తుంది. అదే సమయంలో నూతన పార్లమెంట్‌ భవనంలో రాజదండం ప్రతిష్ఠించారు. అది యాదృచ్ఛికం. కావాలని చేయలేదు. ఆ సినిమా కథాలోచన ఆర్నెల్ల కిత్రం నాటిది. నేను ప్రకటించిన మరో కొత్త చిత్రం ‘ది ఇండియా హౌజ్‌’ (The India House)ని వీర్‌ సావర్కర్‌ బయోపిక్‌ అని అందరూ అనుకున్నారు. ఈ సినిమా ఆయన జీవిత చరిత్రతో తెరకెక్కట్లేదు. సినిమా బాగుంటేనే ప్రేక్షకులు థియేటర్లకి వస్తారు. రైట్‌ వింగ్‌, లెఫ్ట్‌ వింగ్‌.. ఇలా ఎవరి సపోర్ట్‌తోనో సినిమా తీస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ లెఫ్ట్‌, రైట్‌ కలవాలనేదే నా ప్రయత్నం’’ అని నిఖిల్‌ చెప్పారు.

స్పై సంగతులివీ..

‘గూఢచారి’, ‘హిట్‌’ తదితర చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బీహెచ్‌ ఈ పాన్‌ ఇండియా సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య మేనన్‌, సాన్యా ఠాకూర్‌ కథానాయికలు. ఈ సినిమా జూన్‌ 29న విడుదల కానుంది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక రహస్యాన్ని కథలో ఓ భాగంగా మాత్రమే చెప్పబోతున్నామని, అదే అసలైన కథ కాదని నిఖిల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని