Thangalaan: విక్రమ్‌ మరో ప్రయోగం.. 118 రోజులకు ముందు అలా.. ఇప్పుడిలా!

తన తాజా చిత్రం ‘తంగలాన్‌’పై అభిమానులకు అప్‌డేట్‌ ఇచ్చారు ప్రముఖ హీరో విక్రమ్‌. ఆయన ఏం చెప్పారంటే?

Published : 04 Jul 2023 22:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంపిక చేసుకున్న పాత్రకు జీవం పోసే నటుడు.. విక్రమ్‌ (Vikram). ‘అపరిచితుడు’, ‘మనోహరుడు’ వంటి ఎన్నో చిత్రాల్లో ప్రయోగాత్మక పాత్రలు పోషించి, శెభాష్‌ అనిపించుకున్నారు. తాజా చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan)లో మరో విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. చిత్రీకరణ పూర్తయిందని తెలియజేస్తూ రెండు ఫొటోల (చిత్రీకరణ ప్రారంభించినప్పటిది, ముగిసినప్పటిది)ను షేర్‌ చేశారు. వాటిల్లో విక్రమ్‌తోపాటు మాళవిక మోహనన్‌ (Malavika Mohanan), దర్శకుడు కనిపించారు. చిత్రీకరణ సాగిన 118 రోజుల్లో చాలా మార్పొచ్చినట్టు పేర్కొన్నారు. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసిన క్షణాల్ని ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. నటుడిగా గొప్ప అనుభవం వచ్చిందన్నారు.

మరోవైపు, చిత్రీకరణ ముగిసిందని తెలియజేస్తూ మాళవిక మోహనన్‌ భావోద్వేగానికి గురయ్యారు. శారీరకంగా, మానసికంగా ఈ సినిమా తనకు సవాలు విసిరిందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన రిహార్సల్స్‌లో విక్రమ్‌ ఇటీవల గాయపడ్డారు. పక్కటెముక విరగడంతో షూటింగ్‌ కొన్ని రోజులు వాయిదా పడింది.

కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీయఫ్‌)లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా పా. రంజిత్‌ (Pa. Ranjith) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మాళవిక మోహన్‌, పార్వతి కథానాయికలుగా నటించారు. పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ, విదేశీ భాషల్లో 2డీ, 3డీలో సిద్ధమవుతోంది. స్టూడియో గ్రీన్‌, నీలం ప్రొడక్షన్‌ సంస్థల పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ స్వరాలందించారు. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించనున్న ఈ సినిమాను 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని