Actor Visweswara Rao: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హాస్యనటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత

Visweswara Rao: తనదైన నటనతో ప్రేక్షకులను నవ్వించిన హాస్యనటుడు విశ్వేశ్వరరావు మంగళవారం కన్నుమూశారు.

Published : 02 Apr 2024 17:59 IST

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తాజాగా తమిళ నటుడు డేనియల్‌ బాలాజీ మరణాన్ని మరువకముందే మరో విచారకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు (62) (Actor Visweswara Rao) కన్నుమూశారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన పలు చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. ముఖ్యంగా హాస్యనటుడిగా ఆయన కామెడీ టైమింగ్‌ అద్భుతం. కనిపించేది కొద్దిసేపే అయినా కడుపుబ్బా నవ్వించి వెళ్లిపోయేవారు.

గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న విశ్వేశ్వరరావు మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విశ్వేశ్వరరావు మృతికి తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ నటులు ప్రార్థించారు.

బాల నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన విశ్వేశ్వరరావు 150కు పైగా తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపైనా వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ల దగ్గరినుంచి నేటి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్‌, నాగార్జున, పవన్‌కల్యాణ్‌లతో కలిసి నటించారు. ‘ముఠా మేస్త్రీ’, ‘బిగ్‌బాస్‌’, ‘ప్రెసిడెంట్‌ గారి పెళ్లాం’, ‘ఆయనకు ఇద్దరు’, ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ వంటి విజయవంతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విస్సు టాకీస్ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న ఆయన తన అనుభవాలను చెబుతూ నెటిజన్లకు కూడా బాగా దగ్గరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని