jayaprada: సినీ నటి జయప్రదకు ఆర్నెల్ల జైలు శిక్ష.. ఖరారు చేసిన ఎగ్మోర్‌ కోర్టు

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jayaprada)కు ఆరు నెలల శిక్షను విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పును వెలువరించింది.

Updated : 11 Aug 2023 14:43 IST

చెన్నై: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jayaprada)కు ఆరు నెలల శిక్షను విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పును వెలువరించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి ఈ శిక్ష ఖరారు చేసింది. అంతేకాకుండా, రూ.5000 చొప్పున ఒక్కొక్కరికి జరిమానా విధించింది. అలనాటి నటి జయప్రద చెన్నైలోని రాయపేటలో గతంలో ఓ సినిమా థియేటర్ నిర్వహించారు. చెన్నైకు చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి థియేటర్‌ పనులు చూసుకునేవారు. తొలుత బాగా లాభాలు వచ్చినా తర్వాత రాబడి తగ్గడంతో పాటు థియేటర్ మూసేశారు. ఆ సమయంలో కార్మికుల నుంచి ఈఎస్ఐ రూపంలో కొంత డబ్బులు వసూలు చేశారు. థియేటర్ మూసివేయడంతో తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. వాటిని కార్మికులకు అందజేయలేదు. దీంతో కార్మికులందరూ బీమా కార్పొరేషన్‌ను ఆశ్రయించారు. సదరు బీమా సంస్థ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది.

కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ డబ్బులను తిరిగి వారికి చెల్లించలేదని కోర్టులో పేర్కొంది. దీన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో జయప్రద తదితరులు దాఖలు చేసిన మూడు పిటిషన్లు కొట్టివేసింది. అయితే ఆమె వాటిని కార్మికులకు తిరిగి అందిస్తామని చెప్పినా కోర్టు అంగీకరించలేదు. ఇరుపక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ న్యాయస్థానం జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలుశిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని