Neha shetty: ఆ పాత్రది ప్రత్యేక స్థానం

‘డీజే టిల్లు’ నుంచి జోరు చూపిస్తున్న కథానాయిక... నేహాశెట్టి. ఆ సినిమాతో రాధికగా కుర్రాళ్ల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిందామె. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం కోసం విష్వక్‌సేన్‌తో జోడీ కట్టింది.

Published : 28 May 2024 01:17 IST

‘డీజే టిల్లు’ నుంచి జోరు చూపిస్తున్న కథానాయిక... నేహాశెట్టి. ఆ సినిమాతో రాధికగా కుర్రాళ్ల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిందామె. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం కోసం విష్వక్‌సేన్‌తో జోడీ కట్టింది. ఇందులో ఆమె బుజ్జి పాత్రతో సందడి చేయబోతోంది. ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా నేహాశెట్టి  సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ... 

‘డీజే టిల్లు’ తర్వాత నుంచి చీరకట్టుతో కనిపించే పాత్రలతోనే ఎక్కువగా నటిస్తున్నారు... ?

అలాంటి పాత్రల్నే  ఎంచుకుంటున్నానా? లేక అలాంటివే నా దగ్గరికి వస్తున్నాయా? (నవ్వుతూ). ఆలోచిస్తే నా దగ్గరికి వస్తున్న పాత్రలే అలా ఉంటున్నాయని అర్థమవుతోంది. చిన్న వయసులోనే పరిశ్రమకి వచ్చాను కదా... తొలినాళ్లల్లో చీరకట్టుపై అవగాహనే ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం చీర నాకు సౌకర్యంగా అనిపిస్తోంది. అయితే నా తదుపరి సినిమాలో మాత్రం మోడ్రన్‌ అమ్మాయిగానే కనిపిస్తా. 

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో మీరు పోషించిన బుజ్జి పాత్ర సంగతులేమిటి? 

90వ దశకం నేపథ్యంలో సాగే కథ ఇది. నేను ఆ కాలంనాటి ధనవంతుల కుటుంబానికి చెందిన ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. అందంగా కనిపిస్తూనే, ధృఢమైన మనస్తత్వమున్న అమ్మాయి బుజ్జి. ట్రైలర్‌లో చూస్తే అందంగా, సౌమ్యంగానే కనిపిస్తుంది. కానీ ఒక అమ్మాయిలో ఎన్ని భావోద్వేగాలు ఉంటాయో అవన్నీ బుజ్జి పాత్రలో కనిపిస్తాయి. చాలా శక్తిమంతమైన పాత్ర. సినిమాలో ఆ పాత్ర చుట్టూ ఆశ్చర్యకరమైన విషయాలు చాలానే ఉంటాయి. 

90లనాటి కథ, పాత్రలు కదా. మరి బుజ్జి పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు? 

అప్పటి సినిమాల్లో కథానాయికలు, ముఖ్యంగా శోభన లుక్‌నీ, ఆమె నటననీ సూచించారు మా దర్శకుడు. అప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా నా ఆహార్యాన్ని మార్చుకుని, అప్పటి కథానాయికల్లాగా  కళ్లతోనే హావభావాలు పలికించే ప్రయత్నం చేశా. యాస పరంగా మాత్రం పెద్దగా సన్నద్ధం కావల్సిన అవసరం రాలేదు.

‘డీజే టిల్లు’ తర్వాత నుంచి మీరు కనిపిస్తే రాధిక అనే పిలుస్తారు. అది మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?

దాన్ని గౌరవంగానే భావిస్తా. మనం పోషించిన పాత్ర పేరుతో మనల్ని పిలవడం అనేది ఏ నటులకైనా ఓ గొప్ప ప్రశంస కదా. షారుక్‌ఖాన్‌ని బాద్‌షా అని పిలిచినంత ఆనందంగా ఉంటుంది నన్ను రాధిక అని పిలిస్తే! ప్రేక్షకుల హృదయాల్లో ఆ పాత్ర అంతటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.   

తదుపరి సినిమాల కబుర్లేమిటి? 

బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నా. అందులో మోడ్రన్‌ అమ్మాయిగా కనిపిస్తా. కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూస్తున్న విధానం మారిపోయింది. వాళ్ల ఆలోచనలకి తగ్గట్టుగానే ఆచితూచి కథల్ని ఎంపిక చేసుకుంటూ, ప్రయాణం చేస్తున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని