Adipurush: ఫస్ట్‌డే ‘ఆదిపురుష్‌’ కలెక్షన్లు ఎంతంటే? ఆ రికార్డు సాధించిన మూడు చిత్రాలు ప్రభాస్‌వే!

రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఓంరౌత్‌ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ బాక్సాఫీస్‌ వద్ద తొలిరోజు రికార్డు వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం తెలిపింది.

Updated : 17 Jun 2023 15:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీజర్‌ నుంచే సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) శుక్రవారం థియేటర్‌లలో అడుగు పెట్టింది. సినిమా చూసిన వారు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ‘రామాయణాన్ని వక్రీకరిస్తూ అనేక సన్నివేశాలను తెరకెక్కించారు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ‘ఆదిపురుష్‌’ హవా కొనసాగుతోంది. తొలి రోజే రూ.100కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ట్వీట్‌ చేసింది.

‘‘‘ఆదిపురుష్‌’కు రికార్డు బ్రేకింగ్‌ ఓపెనింగ్‌ లభించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.140కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. అన్ని వయసుల ప్రేక్షకుల హృదయాలను మా చిత్రం గెలుచుకుంది. ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా మొదటి నుంచి చివరి వరకూ యువ ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించారు. నిజంగా వాళ్లకు మరువలేని అద్భుతమైన అనుభూతి ఇది’’ అని చిత్ర బృంద తెలిపింది. ఇక హిందీలో ప్రభాస్‌, ఓంరౌత్‌లకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా బాగా అయ్యాయి. హిందీలో తొలి రోజు రూ.37.25కోట్ల (నెట్‌) వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్ చేశారు.

ఇప్పటి వరకు ఓపెనింగ్ డేలో తొలి రోజు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఆరు ఉంటే... అందులో మూడు సినిమాలు (బాహుబలి2’, సాహో, ఆదిపురుష్‌) ప్రభాస్ ఖాతాలో ఉండటం గమనార్హం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘ఆదిపురుష్’ సుమారు రూ.50కోట్లు(గ్రాస్‌) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో  ప్రభాస్‌ రాఘవుడిగా నటించిగా కృతిసనన్‌ జానకిగా కనిపించింది. లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. రామాయణానికి ఆధునిక హంగులు జోడించి ఓంరౌత్‌ ‘ఆదిపురుష్‌’ను తీర్చిదిద్దారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని