Adipurush: చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నా: ‘ఆదిపురుష్‌’ రచయిత

‘ఆదిపురుష్‌’ (Adipurush) రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఆయన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. 

Published : 08 Jul 2023 13:15 IST

ముంబయి: దేశ ప్రజలకు ‘ఆదిపురుష్‌’ (Adipurush) రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా (Manoj Muntashir) క్షమాపణలు చెప్పారు. ‘ఆదిపురుష్‌’తో బాధపెట్టినందుకు క్షమించాలంటూ ఇన్‌స్టా వేదికగా తాజాగా ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఆదిపురుష్‌’ వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని అంగీకరిస్తున్నాను. మా వల్ల ఇబ్బందిపడిన వారందరికీ చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నా. ఆ హనుమంతుడు మన్నందరినీ ఐక్యంగా ఉంచాలని .. మన దేశానికి సేవ చేసేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నా’’ అని మనోజ్‌ రాసుకొచ్చారు. ‘ఆదిపురుష్‌’పై తీవ్ర విమర్శలు వచ్చిన తరుణంలో మనోజ్‌ ఇలాంటి పోస్ట్‌ పెట్టడం నెట్టింట వైరల్‌గా మారింది.

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఓంరౌత్‌ (Om Raut) దీన్ని తెరకెక్కించారు. ప్రభాస్‌ (Prabhas) రాఘవుడిగా, కృతిసనన్‌ (Kriti Sanon) జానకిగా నటించారు. భారీ అంచనాల మధ్య జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన నాటి నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. రావణాసురుడు, ఇంద్రజిత్తు లుక్స్‌, సినిమాలోని సంభాషణలు, కొన్ని సన్నివేశాలను పలువురు తప్పుబట్టారు. ముఖ్యంగా ఇంద్రజిత్తు- హనుమంతుడు మధ్య వచ్చే డైలాగ్స్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

మరోవైపు, ‘ఆదిపురుష్‌’ చిత్రబృందానికి అలహాబాద్‌ హైకోర్టు ఇటీవల షాకిచ్చింది. జులై 27న దర్శకుడు ఓం రౌత్‌, నిర్మాత భూషణ్‌ కూమార్‌, డైలాగ్‌ రైటర్‌ మనోజ్‌ మంతాషిర్‌ను కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అన్న విషయాన్ని సమీక్షించి.. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని