Adipurush: ‘ఆదిపురుష్‌’లో హనుమంతుడి డైలాగ్స్‌.. స్పందించిన రైటర్‌

‘ఆదిపురుష్‌’ (Adipurush)లోని హనుమంతుడి డైలాగ్స్‌పై నెట్టింట చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు డైలాగ్స్‌ గురించి మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా స్పందించారు.

Published : 17 Jun 2023 14:37 IST

ముంబయి: ‘ఆదిపురుష్‌’ (Adipurush)లోని సంభాషణలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోన్న వేళ చిత్ర డైలాగ్‌ రైటర్‌ మనోజ్ ముంతాషిర్ శుక్లా (Manoj Muntashir) స్పందించారు. ఎంతో శ్రద్ధ పెట్టి హనుమాన్‌ సంభాషణలు రాశానని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘‘హనుమాన్‌ సంభాషణలు తప్పుగా రాయలేదు. నిశితంగా ఆలోచించాకే డైలాగ్స్‌ రాశా. సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. అందరూ ఒకేలా మాట్లాడరు కదా. పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడం కోసమే డైలాగ్స్‌ను సరళీకరించాను’’

చర్చకు దారి తీసిన హనుమాన్‌ డైలాగ్‌ గురించి స్పందిస్తూ.. ‘‘అలాంటి డైలాగ్స్‌ రాసిన మొదటి వ్యక్తిని నేను కాదు. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కథావాచక్‌ (జానపద కళాకారులు)లు ‘రామాయణం’ను వివరించేటప్పుడు హనుమంతుడి సంభాషణలను ఇలాగే చెప్పేవారు. వాటినే నేను సినిమాలోకి తీసుకున్నాను’’ అని ఆయన తెలిపారు.

ప్రభాస్‌ - కృతిసనన్‌ జంటగా ఓంరౌత్‌ ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రాన్ని తెరకెక్కించారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈసినిమాలో ప్రభాస్‌ రాఘవుడిగా, కృతిసనన్‌ సీతగా కనిపించారు. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలోని  ఓ సన్నివేశంలో ఇంద్రజిత్తుతో హనుమాన్‌ చెప్పే డైలాగ్స్‌.. అంతటా చర్చకు దారి తీశాయి. పలువురు నెటిజన్లు ఆ సంభాషణలను తప్పుబడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని