Adipurush: ‘ఆదిపురుష్‌’లో మార్పులు

‘ఆదిపురుష్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలిరోజు నుంచే నెట్టింట రకరకాల విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సినిమాలో హనుమంతుడి పాత్రకు సంబంధించిన కొన్ని సంభాషణలు.. మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated : 19 Jun 2023 14:03 IST

‘ఆదిపురుష్‌’ (Adipurush) ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలిరోజు నుంచే నెట్టింట రకరకాల విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సినిమాలో హనుమంతుడి పాత్రకు సంబంధించిన కొన్ని సంభాషణలు.. మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆ చిత్ర మాటల రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లా వివరణ ఇచ్చినా.. విమర్శలు ఆగకపోవడంతో ‘ఆదిపురుష్‌’లోని ఆ కొన్ని సంభాషణల్ని మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ఓ భావోద్వేగభరిత పోస్ట్‌ పెట్టారు. ‘‘ప్రతి ఒక్కరి భావోద్వేగాల్ని గౌరవించడం రామకథ నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం అని నా అభిప్రాయం. ‘ఆదిపురుష్‌’ కోసం నేను 4 వేల లైన్లకు పైగా డైలాగులు రాశాను. వాటిలో 5 లైన్లు కొందరిని బాగా బాధించాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీరాముడిని, సీతమ్మను కీర్తిస్తూ చాలా సంభాషణలున్నాయి. కానీ, వాటి కంటే ఈ కొన్ని మాటలే ఎక్కువ ప్రభావం చూపాయనిపిస్తోంది. 3 గంటల సినిమాలో 3 నిమిషాలు మీ ఊహకు భిన్నంగా రాశానని నాపై సనాతన ద్రోహి అని ముద్ర వేశారు. ఈ చిత్రంలో ఉన్న ‘జై శ్రీరాం’, ‘శివోహం’, ‘రామ్‌ సీతారామ్‌’ వంటి గొప్ప పాటలు నా కలం నుంచి పుట్టినవే. మీరు ఇవేమీ చూడకుండా నాపై నింద వేయడంలో తొందరపడ్డారు అనుకుంటున్నా. నన్ను నిందించిన వారిపై నాకెలాంటి ఫిర్యాదులు లేవు. మేము సనాతన సేవ కోసం ఈ సినిమా తీశాం. అందరూ ‘ఆదిపురుష్‌’ను ఎంతో ఆదరిస్తున్నారు. భవిష్యత్తులోనూ మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఉంటాయని ఆశిస్తున్నాను. మాకు ప్రేక్షకుల మనోభావాలు ముఖ్యం. అందుకే చిత్ర బృందం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు బాధ కలిగించిన డైలాగులను మారుస్తున్నాం. ఒక వారంలో ఈ మార్పును చేయనున్నాం. అందరి సూచనలను గౌరవిస్తున్నాం’’ అని ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ప్రభాస్‌ టైటిల్‌ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఓం రౌత్‌ తెరకెక్కించారు. జానకిగా కృతి సనన్‌ నటించగా.. లంకేశుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషించారు. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.240కోట్ల గ్రాస్‌ వసూళ్లు దక్కించుకున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని