Adipurush ott release date: ‘ఆదిపురుష్‌’ బాక్సాఫీస్‌ ముగిసినట్లే! ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందా?

Adipurush ott release date: ప్రభాస్‌ కీలక పాత్రలో నటించిన ‘ఆదిపురుష్‌’ థియేట్రికల్‌ రన్‌ ముగింపునకు వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ విడుదలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Published : 02 Jul 2023 01:29 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కీలక పాత్రలో ఓం రౌత్‌ (Om Raut) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాక్సాఫీస్‌ వద్ద ‘ఆదిపురుష్‌’ సందడి తగ్గింది. మొదటి వారంతో పోలిస్తే, రెండో వారం కలెక్షన్స్‌ క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు చిత్ర బృందమే స్వయంగా ప్రకటించింది. అయితే, ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటివరకూ భారత్‌లో ‘ఆదిపురుష్‌’ రూ.300 కోట్ల (నెట్‌) మార్కును దాటినట్లు చెబుతున్నారు. ఓవర్సీస్‌ లెక్కలు తెలియాల్సి ఉంది. మరోవైపు రోజు రోజుకీ తగ్గుతున్న కలెక్షన్స్‌ చూస్తుంటే, సినిమా థియేట్రికల్‌ రన్‌ ముగింపునకు వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం విడుదలైన కొన్ని చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర సందడి చేస్తున్నాయి. జులై మొదటి వారంలో ఇంకొన్ని చిత్రాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరో వారం పాటు ‘ఆదిపురుష్‌’ థియేటర్‌లో కొనసాగడం సవాలే. దీంతో ఈ సినిమా ఓటీటీ విడుదలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

మరి ఓటీటీలో వచ్చేది అప్పుడేనా?

‘ఆదిపురుష్‌’ (Adipurush) థియేట్రికల్‌ రన్‌ చివరికి వచ్చిన నేపథ్యంలో ఓటీటీలో ఎప్పుడు వస్తుందా? (Adipurush ott release date) అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్‌మీడియా వేదికగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకున్న సంగతి తెలిసిందే. జులై 15, 16 తేదీల్లో ‘అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్స్‌’ (amazon prime day sale) ఉన్నాయి. ఈ సందర్భంగా ‘ఆదిపురుష్‌’ను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు టాక్‌. దీనిపై అటు చిత్ర బృందం, ఇటు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది. అంటే జులై 16న ‘ఆదిపురుష్‌’ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తే సరిగ్గా నెల రోజులకు ఓటీటీకి వచ్చినట్లే. ఈ చిత్రంలో రాఘవుడిగా ప్రభాస్‌ (Prabhas) నటించగా, జానకిగా కృతిసనన్‌ నటించారు. రావణుడిగా లంకేశ్‌పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపించారు. టి.సిరీస్‌ ఫిల్మ్స్ పతాకంపై భూషణ్‌కుమార్‌, కృషన్‌కుమార్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్స్‌ ఒక్కొక్కటిగా చిత్ర బృందం విడుదల చేస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని