Adipurush: ‘ఆదిపురుష్‌’ కలెక్షన్స్‌ ఆ విషయాన్ని రుజువు చేశాయి: నిర్మాత వివేక్‌ కూచిబొట్ల

‘ఆదిపురుష్‌’ (Adipurush)కు విమర్శలు వెల్లువెత్తుతోన్న తరుణంలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్‌ తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈతరం వారిని దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు చెప్పారు. 

Published : 19 Jun 2023 19:39 IST

హైదరాబాద్‌: మంచి చెబితే ప్రజలు తప్పకుండా సపోర్ట్‌ చేస్తారని ‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమా వసూళ్లు రుజువు చేశాయని నిర్మాత వివేక్‌ కూచిబొట్ల అన్నారు. సినిమాపై ఎన్ని విమర్శలు వస్తున్నాయో.. అదేవిధంగా కలెక్షన్స్‌ కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని కోటిమంది వీక్షించిన సందర్భంగా ‘ఆదిపురుష్‌’ డిస్ట్రిబ్యూటర్స్‌, లిరిక్‌ రైటర్‌ రామజోగయ్య శాస్త్రి తాజాగా హైదరాబాద్‌లో  ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఇందులో సినిమాకు వస్తోన్న విమర్శలపై స్పందించారు.

‘‘ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని కోటి మంది వీక్షించారు. రామనామాన్ని ప్రతి ఇంటికి చేర్చాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని రూపొందించారు. కోటిమంది వీక్షించడంతో మేము సగం సఫలీకృతం అయ్యాం. ఎవరైతే ట్రోల్‌ చేయాలని చూశారో వాళ్లూ రాముడిని పరోక్షంగా తలచుకుంటూ.. పుణ్యం పొందుతున్నారు. ఎన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయో కలెక్షన్స్‌ కూడా అదే మాదిరిగా వస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత కలెక్షన్స్‌ పరంగా ప్రతి రోజూ ఒక రికార్డ్‌ క్రియేట్‌ చేస్తుంది. మంచి చెబితే ప్రజలు తప్పకుండా సపోర్ట్‌ చేస్తారని వసూళ్లు రుజువు చేశాయి. కంటెంట్‌ విషయానికి వస్తే, చిన్నపిల్లలకు అర్థమయ్యేలా సినిమా చేయాలంటే.. పాతకాలంలో మాదిరిగా చెబితే అప్‌డేట్‌ అవ్వండి అని చెబుతారు. అప్‌డేట్‌ అయ్యి సినిమా చేస్తే విమర్శలు చేస్తున్నారు. రావణాసురుడు ఏంటి ఇలా ఉన్నాడు? అని ప్రశ్నిస్తున్నారు. రావణాసురుడిని మనం చూడలేదు. మీ ఊహల్లో ఆయన ఒకలా ఉండొచ్చు. మా ఊహల్లో ఆయన మరోలా ఉండొచ్చు. ఇందులో ఎక్కడా చరిత్రను తప్పుదోవ పట్టించలేదు. ఇక, ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి చాలా సమయం పట్టొచ్చు’’ అని వివేక్‌ అన్నారు.

అనంతరం లిరిక్స్‌ రైటర్‌ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ‘‘ఈ తరానికి మన ఇతిహాసాన్ని అందచేయాలనే గొప్ప సంకల్పం ఓంరౌత్‌కు కలిగింది. ఆయన సంకల్పంలోని స్వచ్ఛతను మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. సినిమా చూసేందుకు హనుమాన్‌ వస్తారంటూ ప్రీరిలీజ్‌లో చెప్పినప్పుడు ఆయన స్వరం గద్గదమైంది. నిజంగా వక్రీకరించాలనుకుంటే ఆనాడు అంత భావోద్వేగానికి గురి కారు. ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. తనకున్న విజన్‌తో ఆయన ఈసినిమా చేశారు. ఈ ప్రయత్నాన్ని సంకల్ప నేపథ్యంలో చూడాలి. ఈ తరం పిల్లలకు అనువైన భాష.. టెక్నాలజీ సాయంతో రామాయణాన్ని చెప్పాలనుకోవడం గొప్ప ప్రయత్నం. దాన్ని ప్రోత్సహించాలి కానీ, నిందించకూడదు. చిన్నచిన్న లోపాలు ఉండటం సహజం. రాముడు కూడా చిన్న చిన్న అడ్డంకులు దాటుకునే లంకకు చేరుకున్నాడు. అలా, ఈ సినిమా కూడా తప్పకుండా ఊహించని వసూళ్లు రాబడుతుంది. ప్రజాదరణ మెండుగా పొందుతుంది’’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని