Agent ott: ఆ మార్పులతో ఓటీటీలో అఖిల్‌ ‘ఏజెంట్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Agent ott release date: అఖిల్‌ కథానాయకుడిగా నటించిన ‘ఏజెంట్‌’ చిత్రం మార్పులతో ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

Published : 10 Jun 2023 11:01 IST

హైదరాబాద్‌: అఖిల్‌ (Akhil) కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’ (Agent). ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అక్కినేని అభిమానులను నిరాశ పరిచినందుకు చిత్ర బృందం కూడా వివరణ ఇచ్చింది. అంతేకాదు, రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, చివరి నిమిషంలో స్ట్రీమింగ్‌ విడుదలను వాయిదా వేశారు. త్వరలోనే ఓటీటీ విడుదలను ప్రకటిస్తామని చెప్పారు. థియేటర్‌లో ప్రేక్షకులను నిరాశ పరిచిన నేపథ్యంలో ఓటీటీ వెర్షన్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అనవసర సన్నివేశాలను తొలగించి, నిడివి కారణంగా తొలగించిన మంచి సీన్స్‌ను జోడించి సరికొత్త వెర్షన్‌ను విడుదల చేయనున్నారు. జూన్‌ 23న సోనీలివ్‌ వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘ఏజెంట్‌’ను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. దీనిపై ఓటీటీ వేదిక సోనీలివ్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

‘ఏజెంట్‌’ కథేంటంటే: రిక్కీ అలియాస్‌ రామకృష్ణ (అఖిల్‌) ఓ మధ్య తరగతి కుర్రాడు. స్పై అవ్వడమే లక్ష్యంగా జీవిస్తుంటాడు. ఇందుకోసమే ‘రా’లో చేరేందుకు మూడుసార్లు పరీక్ష రాస్తాడు. కానీ, ప్రతిసారీ ఇంటర్వ్యూలో రిజెక్ట్‌ అవుతుంటాడు. దీంతో ఇలా ప్రయత్నిస్తే లాభం లేదనుకొని తన ఎథికల్‌ హ్యాకింగ్‌ నైపుణ్యాలతో ఏకంగా ‘రా’ చీఫ్‌ డెవిల్‌ అలియాస్‌ మహదేవ్‌ (మమ్ముట్టి) సిస్టమ్‌ను హ్యాక్‌ చేసి.. అతడి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తాడు. (Agent ott release) కానీ, రిక్కీ కోతి చేష్టలు చూసి ఆయన కూడా తనని రిజక్ట్‌ చేసి వెళ్లిపోతాడు. మరోవైపు భారత దేశాన్ని నాశనం చేసేందుకు గాడ్‌ అలియాస్‌ ధర్మ (డినో మోరియా) చైనాతో కలిసి మిషన్‌ రాబిట్‌ పేరుతో ఓ భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. అయితే వీళ్ల కుట్రను చేధించి, మిషన్‌ రాబిట్‌ను అడ్డుకునేందుకు మహదేవ్‌ తన ఏజెంట్‌ సాయంతో ఓసారి ప్రయత్నించి విఫలమవుతాడు. దీంతో ఆయన రెండోసారి ఆ మిషన్‌ కోసం రిక్కీని రంగంలోకి దించుతాడు. మరి ‘రా’కి పనికి రాడని పక్కకు పెట్టేసిన రిక్కీని అంత పెద్ద మిషన్‌ కోసం మహదేవ్‌ ఎందుకు రంగంలోకి దింపాడు? ఆయన ఆదేశాల్ని పక్కకు పెట్టి రిక్కీ కొని తెచ్చుకున్న ప్రమాదాలేంటి? అసలు స్పై అవ్వాలన్న తన లక్ష్యం వెనకున్న బలమైన కారణం ఏంటి? అతను మిషన్‌ రాబిట్‌ను ఎలా అడ్డుకున్నాడు?వైద్య (సాక్షి వైద్య)తో అతని ప్రేమాయణం ఏమైంది? ఈ కథలో కేంద్రమంత్రి జయకిషన్‌ (సంపత్‌ రాజ్‌) ఏంటి? అన్నది మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు