Aishwarya Rajesh: ‘డియర్‌’.. ‘గుడ్‌నైట్‌’ ఫిమేల్‌ వెర్షన్‌ కాదు: ఐశ్వర్యరాజేశ్‌

ఐశ్వర్య రాజేశ్‌, జీవీ ప్రకాశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌’. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకుడు.

Published : 08 Apr 2024 19:40 IST

హైదరాబాద్‌: జీవీ ప్రకాశ్‌ (GV Prakash), ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌’ (Dear). ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. తన భార్య గురక వల్ల ఒక అబ్బాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనే ఆసక్తికర అంశాలతో దీనిని తీర్చిదిద్దారు. ఏప్రిల్‌ 12న ఇది తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘డియర్‌’ చిత్రబృందం తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మీ సినిమా ప్రచార చిత్రాలు చూస్తుంటే ‘గుడ్‌నైట్‌’కు ఫిమేల్‌ వెర్షన్‌లా ఉంది?

ఐశ్వర్య రాజేశ్‌: చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్లందరికీ ఒకటే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ కథకు, మా చిత్రానికి ఏ సంబంధం లేదు. రెండింటి మధ్య ఉన్న ఒకే ఒక్క కామన్‌ పాయింట్‌ గురక. దాదాపు నాలుగేళ్ల క్రితం ఆనంద్‌ ఈ కథ రాశారు. నిజం చెప్పాలంటే, మా చిత్రానికి ‘గుడ్‌నైట్‌’ అనే టైటిల్‌ పెట్టాలనుకున్నాం. కాకపోతే, ఆ చిత్రబృందం అడిగారని మేమే వాళ్లకు ఇచ్చేశాం.

తెలుగు చిత్రాల్లో మీకు అవకాశాలు రావడం లేదా?

ఐశ్వర్య రాజేశ్‌: తెలుగులో అవకాశాలు బాగా వస్తున్నాయి. టాలీవుడ్‌లో సినిమా చేస్తే విభిన్నమైన కథ, బిగ్‌ మూవీ అయి ఉండాలనుకుంటున్నా. అలాంటి కథ నాకింకా దొరకలేదు. ప్రత్యేకంగా ఇదే జానర్‌లో సినిమాలు చేయాలని ఏమీ లేదు. నా మనసుకు నచ్చిన కథ వచ్చినప్పుడు తప్పకుండా యాక్ట్ చేస్తా.

రియల్‌ లైఫ్‌లో మీరు ఎలాంటి స్లీపర్‌..?

ఐశ్వర్య రాజేశ్‌: నేను చాలా లైట్‌ స్లీపర్‌. గురక పెట్టను. కొంచెం శబ్దం వినిపించినా మెలకువ వచ్చేస్తుంది. మా అమ్మ చిన్నగా గురక పెడుతుంటారు. ఆమె కనుక శబ్దం చేయకపోతే నాకు భయంగా అనిపిస్తుంది.

పెళ్లి తర్వాత మీ భర్త గురకపెడితే ఓకేనా?

ఐశ్వర్య రాజేశ్‌:  ఏం చేస్తాం. అదే కదా తలరాత.

నటుడిగా మీరు పలు రొమాంటిక్‌ చిత్రాల్లో నటించారు. మీ భార్య ఎలా ఫీలవుతుంటారు?

జీవీ ప్రకాశ్‌: ఇది కేవలం సినిమా మాత్రమేననే విషయాన్ని నా భార్య చక్కగా అర్థం చేసుకుంది. కపుల్‌ కావడానికంటే ముందు మేము స్నేహితులం. స్కూల్‌ రోజుల్లోనే తనతో నాకు పరిచయం ఏర్పడింది. తనెప్పుడూ నన్ను సపోర్ట్‌ చేస్తూనే ఉంటుంది.

మీరు ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

ఐశ్వర్య రాజేశ్‌: గతంలో నేను ‘కన్నా’ అనే మూవీ చేశా. క్రికెట్‌ నేపథ్యంలో సాగే కథ అది. నాకు క్రికెట్‌ తెలియదు. ఆరు నెలలపాటు శిక్షణ పొంది, వర్క్‌ చేశా.  కొంతకాలం క్రితం నాకొక బిగ్‌ ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చింది. దర్శకుడు చెప్పిన కథ విన్నప్పుడు హీరోయిన్‌గా నేను సెట్‌ కాననిపించింది. నాకు తెలిసిన వేరే హీరోయిన్‌కు అది బాగా నప్పుతుందనిపించింది. ఆమె పేరు పరిశీలించమని చెప్పా. ఆమె నటించింది.

తెలుగులో ఎప్పుడు యాక్ట్‌ చేస్తారు?

జీవీ ప్రకాశ్‌: త్వరలోనే చేయాలనుకుంటున్నా. ‘దసరా’లో నాకు అవకాశం వచ్చింది. కాకపోతే, ఆ సమయంలో డేట్స్‌ పరంగా ఇబ్బందులు తలెత్తాయి. దాంతో నేను ఆ చిత్రబృందానికి నో చెప్పాల్సి వచ్చింది. ఓ వైపు సినిమాలు, మరోవైపు సంగీతం.. ఇలా నేను టైమ్‌ను సెట్‌ చేసుకున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని