Adipurush: అమిత్‌షా గారూ.. ‘ఆదిపురుష్‌’ మేకర్స్‌పై చర్యలు తీసుకోండి

‘ఆదిపురుష్‌’ (Adipurush) వివాదం రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఈ సినిమా మేకర్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ తాజాగా కేంద్రమంత్రి అమిత్‌ షా(Amit Shah)కు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ లేఖ రాసింది.

Published : 24 Jun 2023 22:31 IST

ముంబయి: ‘ఆదిపురుష్‌’ (Adipurush) దర్శక నిర్మాతలు, రచయితపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి అమిత్‌ షా (Amit Shah)కు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ శనివారం ఓ లేఖ రాసింది. హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా ఈ చిత్రాన్ని రూపొందించారని, కాబట్టి వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విన్నపం చేసింది.

‘‘దేశవ్యాప్తంగా ఈ నెల 16న విడుదలైన ‘ఆదిపురుష్‌’ గురించి మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ లేఖ రాస్తున్నాం. సీతారాములు, హనుమంతుడిని పూజించే వారి మనోభావాలను దెబ్బతీసేలా దీన్ని రూపొందించారు. మల్టీప్లెక్సుల్లో టికెట్‌ ధరలపై డిస్కౌంట్స్‌ ఇస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు. అలా ఈ సినిమా వల్ల రామాయణం గురించి ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుంది. అగౌరవమైన సంభాషణలు, వస్త్రధారణతో చిత్ర నిర్మాతలు, మాటల రచయిత మనోజ్‌, దర్శకుడు ఓంరౌత్‌ రామాయణాన్ని అపహాస్యం చేశారు. కాబట్టి వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం’’ అని ఆ లేఖలో అసోసియేషన్‌ సభ్యులు పేర్కొన్నారు.

ప్రభాస్‌ (Prabhas) - కృతిసనన్‌ (Kriti Sanon) జంటగా ఓంరౌత్‌ (Om Raut) తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సినిమా విడుదలైన నాటి నుంచి ఏదో ఒక విధంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని దీన్ని తెరకెక్కించినప్పటికీ.. ఇప్పటివరకూ వచ్చిన ఏ రామాయణ రచనలతోనూ దీనికి పోలిక లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు హనుమంతుడి సంభాషణలపై అంతటా తీవ్ర దుమారం రేగడంతో మేకర్స్‌ వాటిని మార్చిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు