Adipurush: ‘ఆదిపురుష్‌’ చిత్రబృందానికి అలహాబాద్‌ హైకోర్టు సమన్లు

ప్రభాస్‌ ప్రధాన పాత్రలో ఓం రౌత్‌ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం విడుదలైనప్పటి నుంచి పలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది.

Updated : 02 Jul 2023 14:05 IST

ప్రభాస్‌ (Prabhas) ప్రధాన పాత్రలో ఓం రౌత్‌ తెరకెక్కించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం విడుదలైనప్పటి నుంచి పలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా ఆదిపురుష్‌ చిత్రబృందానికి అలహాబాద్‌ హైకోర్టు షాకిచ్చింది. జులై 27న చిత్రబృందం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను శుక్రవారం హైకోర్టు తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. అందులో దర్శకుడు ఓం రౌత్‌, నిర్మాత భూషణ్‌ కూమార్‌, డైలాగ్‌ రైటర్‌ మనోజ్‌ మంతాషిర్‌ను కోర్టులో హాజరు కావాలని తెలిపింది. ఈ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందా లేదా అన్న విషయాన్ని సమీక్షించి.. తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి అలహాబాద్‌ హైకోర్టు సూచించింది. అంతే కాకుండా ఈ సినిమాకు సర్టిఫికెట్‌ మంజూరు చేసిన నిర్ణయాన్ని కూడా సమీక్షించాల్సిందిగా ప్రభుత్వానికి నిర్దేశించింది. కుల్దీప్‌ తివారీ, నవీన్‌ ధావన్‌ వేసిన వేర్వేరు పిటిషన్లను.. జస్టిస్‌ రాజేష్‌ సింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ శ్రీ ప్రకాష్‌ సింగ్‌తో కూడిన ఓ వెకేషన్‌ బెంచ్‌ విచారించింది. ఈ క్రమంలో సినిమా ప్రసారం కోసం సినిమా సర్టిఫికేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను పాటించారా అనే విషయానికి వివరణ ఇచ్చేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలాగే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ఛైర్మన్‌లు తమ వ్యక్తిగత అఫిడవిట్‌లను దాఖలు చేయాలని బెంచ్‌ ఆదేశించింది. తదుపరి విచారణ తేదీలోగా అవసరమైన అఫిడవిట్‌లను దాఖలు చేయని పక్షంలో.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీ కంటే తక్కువ స్థాయిలో లేని క్లాస్‌-1 అధికారితో పాటు సీబీఎఫ్‌సీకి చెందిన ఓ అధికారి రికార్డులతో సహా కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆదిపురుష్‌ దర్శకుడు, రచయిత అలాగే నిర్మాతలు.. విచారణ తేదీలోగా వ్యక్తిగత అఫిడవిట్‌లను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అఫిడవిట్‌లు వచ్చే వరకు చిత్రబృందం సభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది.    

 ఈటీవీ భారత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని