Allu Aravind: ఇలా దిల్‌ రాజు మాత్రమే చేయగలరు: అల్లు అరవింద్‌

ఆశిష్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్‌ మీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నిర్మాత అల్లు అరవింద్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

Published : 23 May 2024 20:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆశిష్‌ (Ashish), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నూతన దర్శకుడు అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గురువారం నిర్వహించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘మీరు గతంలో ఏమైనా సినిమాలు తెరకెక్కించారా? అని అరుణ్‌ని అడిగా. చేయలేదని ఆయన సమాధానమిచ్చారు. ‘దర్శకత్వంలో అనుభవం లేని వారికీ అవకాశాలివ్వడం దిల్‌ రాజుకే సాధ్యం’ అని అన్నాను. ‘మీరు కూడా చేయాలి సర్‌’ అని ఆయనంటే.. ఆ ధైర్యం నేను చేయలేనన్నా (నవ్వుతూ). కీరవాణి, పీసీ శ్రీరామ్‌లాంటి ప్రముఖ సాంకేతిక నిపుణులతో కలిసి తొలి సినిమాకే పని చేయడం అరుణ్‌ అదృష్టం. సినిమా విజయం అందుకోవాలని’’ అని ఆకాంక్షించారు.

‘దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌’ లక్ష్యం అదే: దిల్‌ రాజు

‘‘హర్షిత్‌ రెడ్డి సినిమాపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారాడు. హన్షిత చిన్నప్పటినుంచి షూటింగ్స్‌కు వెళ్లేదిగానీ సినిమా రంగంలోకి వస్తుందని నేను అనుకోలేదు. ఈ ఇద్దరూ కలిసి ‘దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌’ బ్యానర్‌పై చిత్రాలు నిర్మిస్తున్నారు. అలా తొలి సినిమా ‘బలగం’తో వేణు యెల్దండిని దర్శకుడిగా పరిచయం చేశారు. ‘లవ్‌ మీ’తో అరుణ్‌కు ఛాన్స్‌ ఇచ్చారు. హరి, శాండీ.. ఇలా మరికొందరు ఉన్నారు. త్వరలోనే వారి సినిమాల వివరాలు ప్రకటిస్తాం.    ఈ నిర్మాణ సంస్థ ద్వారా కొత్తవారిని ప్రోత్సహించాలనేదే మా లక్ష్యం’’

‘‘ఆశిష్‌ బాల్యం నుంచీ డ్యాన్స్‌ బాగా చేసేవాడు. తన ఉత్సాహం చూసి హీరో అవుతాడని ఎప్పుడో ఊహించా. నాకు సినిమా తప్ప మరో రంగంపై ఆసక్తి లేదు. అందుకే నేను వేరే వ్యాపారాలేవీ చేయట్లేదు. ‘లవ్‌ మీ’.. సవాలుతో కూడుకున్న కథ. దర్శకత్వంలో అనుభవం లేకపోయినా అరుణ్‌ అద్భుతంగా తెరకెక్కించారు. కీరవాణి సర్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌. ఆయన 10 పాటలు అందించారు. కానీ, ఐదు పాటలనే సినిమాలో వినియోగించాం’’ అని దిల్‌ రాజు (Dil Raju) తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని