Allu aravind: త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల్ని కలుస్తాం: అల్లు అరవింద్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడాన్ని నిర్మాత అల్లు అరవింద్‌ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల్ని కలుస్తామన్నారు.

Updated : 05 Dec 2023 09:33 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడాన్ని నిర్మాత అల్లు అరవింద్‌ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల్ని కలుస్తామన్నారు. గత ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయని.. ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే విధంగా చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో జరిగిన చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ది కృష్ణ’, ‘ఛోటా భీమ్‌’ లాంటి యానిమేషన్‌ చిత్రాలతో అందరికీ దగ్గరైన గ్రీన్‌ గోల్డ్‌ స్టూడియోస్‌ సంస్థ నుంచి వస్తున్న కొత్త నిర్మాణ సంస్థే ఈ చిలక ప్రొడక్షన్స్‌. ఈ బ్యానర్‌ లోగోను నిర్మాత శరత్‌ మరార్‌తో కలిసి ఆవిష్కరించారు అల్లు అరవింద్‌. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మా నాన్న సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనే పిచ్చితో 70ఏళ్ల క్రితం పాలకొల్లులో మమ్మల్ని అందర్నీ వదిలేసి ఓ పెట్టె సర్దుకొని వచ్చేశారు. అటువంటి పిచ్చి ఈ రోజున మమ్మల్ని ఇంతవాళ్లను చేసి.. ఇంత పెద్ద కుటుంబంగా మార్చింది. రాజీవ్‌ చిలక కూడా అలాంటి పిచ్చి ఉన్న వ్యక్తే. నేను తనని రాజమౌళితో పోల్చుకుంటా. ఎప్పుడూ ఒక కొత్త పనిని, ప్రయోగాన్ని చేయాలని తపన పడుతుంటాడు’’ అన్నారు. ‘‘లయన్‌ కింగ్‌’ లాంటి సినిమా చేయాలనే లక్ష్యంతో గ్రీన్‌ గోల్డ్‌ సంస్థ ప్రారంభించాం. మా చిలక ప్రొడక్షన్స్‌లో రెండు తెలుగు సినిమాలతో పాటు హిందీలో ఓ చిన్న  పిల్లల చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు రాజీవ్‌ చిలకలపూడి, శ్రీనివాస్‌ చిలకలపూడి.

ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదు..

గోవాలో జరిగిన ఓ అవార్డుల వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. ఆ అవార్డుల వేడుక ఒక వ్యక్తికి సంబంధించినదని.. కానీ, దాన్ని తెలుగు పరిశ్రమకు ఆపాదించడం సరికాదన్నారు. అలాగే ఆ అవార్డుల వేడుక నిర్వాహకుడు తమ కుటుంబంలోని హీరోకి పీఆర్‌ఓ అని కొన్ని కథనాలు వచ్చాయని.. కానీ, ఆ వ్యక్తి తమ కుటుంబంలో ఎవరికీ పీఆర్‌ఓ కాదని స్పష్టత ఇచ్చారు.

  • తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం పట్ల శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని