RRR: ‘ఆస్కార్’ అంటే అప్పుడు కల అనుకున్నా.. కానీ: అల్లు అరవింద్‌

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ వేడుక’లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ని కొనియాడారు. ఆస్కార్‌ అంటే ఇప్పుడు కల కాదని పేర్కొన్నారు.

Updated : 09 Apr 2023 21:01 IST

హైదరాబాద్‌: ‘ఆస్కార్‌’ అంటే కల అనుకున్నానని, అసాధ్యమైన దాన్ని రాజమౌళి (Rajamouli) బృందం సుసాధ్యం చేసిందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆస్కార్‌’ (Oscar) విజేతలైన సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (M M Keeravani), గేయ రచయిత చంద్రబోస్‌ (Chandrabose)ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ వేడుకకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి అరవింద్‌ మాట్లాడుతూ... ‘‘ఆస్కార్‌.. అందుకోవడం అసాధ్యం. అదొక కల’ అని మనం అనుకునేవాళ్లం. ‘మనం ఎలాగో ఆస్కార్‌ తీసుకోలేం. కానీ, ఆ అవార్డులు ఇచ్చే చోటైనా చూడాలి’ అని అనుకుని పదేళ్ల క్రితం నేను అమెరికా వెళ్లినప్పుడు ‘ఆస్కార్’ ప్రదానోత్సవం జరిగే వేదిక చూశా. అలాంటిది ఇప్పుడు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌.. మనమంతా గర్వించేలా చేశారు. వారిని ఆ వేదికపై చూసినప్పుడు నా కడుపు నిండిపోయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఏం సాధించిందో చెప్పేందుకు ఆ పురస్కారం ఒక కొలమానం. ‘క్షణ క్షణం’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన ఎం.ఎస్‌.రెడ్డి.. పాటలు బాగున్నాయంటున్నారంతా అంటూ సంగీత దర్శకుడుని నీ పేరేంటి? అని అడిగారు. ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరో కాదు కీరవాణి. ఆ కీరవాణి గురించి తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి చూపుతోంది. అంతటి స్థాయికి చేరుకున్నారాయన. ‘ఇది కాదు మరోటి రాయి.. అలా కాదు ఇలా రాయి’ అంటూ మేం దబాయించిన వ్యక్తి (చంద్రబోస్‌).. చెట్టుకున్న మామిడికాయ కోసి తీసుకొచ్చినంత తేలిగ్గా ఆస్కార్‌ని పట్టుకొస్తే ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు సినిమాని అగ్ర స్థానాన నిలిపిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి కృతజ్ఞతలు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ సినిమాని నేను నిర్మించానని చెప్పడానికి గర్వంగా ఉంది’’ అని అల్లు అరవింద్‌ అన్నారు.

వీరంతా మా సభ్యులుకావడం ఆనందం: పరుచూరి గోపాలకృష్ణ

‘‘ముందుగా ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యగారికి కృతజ్ఞతలు. ఆ సినిమా విజయం పట్ల మా రచయితల సంఘం చాలా ఆనందంగా ఉంది. ఆ చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాద్‌, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, మాటల రచయిత సాయి మాధవ్‌ బుర్రా, గేయ రచయిత చంద్రబోస్‌.. వీరంతా మా సంఘం సభ్యులని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నా’’ అని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని