Amitabh Bachchan: ఆ రోజులు అలాంటివి: అమితాబ్‌ బచ్చన్‌

1979లో తాను నటించిన చిత్రం మిస్టర్‌ నట్వర్‌లాల్‌ సెట్‌లోని తన ఫొటోను ఆదివారం ఆయన నెటిజన్లతో పంచుకున్నారు బిగ్‌బీ.

Published : 01 Apr 2024 19:50 IST

దిల్లీ: సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తన తొలినాళ్ల నాటి చిత్రాల సంగతులను అమితాబ్‌ బచ్చన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో తరచూ పంచుకుంటుంటారు. 1970లలో యాక్షన్‌ సన్నివేశాలను దర్శకులు ఎలా చిత్రీకరించేవారో గుర్తు చేసుకున్నారు. 1979లో తాను నటించిన చిత్రం మిస్టర్‌ నట్వర్‌లాల్‌ సెట్‌లోని తన ఫొటోను ఆదివారం ఆయన నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘అప్పట్లో సినిమాల్లోని యాక్షన్‌ సన్నివేశాల్లో నటించే సమయంలో నటీనటులకు ఎటువంటి రక్షణ ఉండేది కాదు. యాక్షన్ సీన్స్ కోసం 30 అడుగుల కొండపై నుంచి దూకాలి.. జీను లేదు, డూప్‌లు లేరు, వీఎఫ్ఎక్స్ అంతకంటే లేవు. అలా దూకినప్పుడు మీరు కింద వేసి ఉన్న పరుపులపై పడితే అదృష్టవంతులు.. ఆ రోజులు అలాంటివి.’’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 

అమితాబ్‌ పెట్టిన పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ ఆయన నటనా కౌశలాన్ని కొనియాడారు. అమితాబ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అంత కష్టపడ్డారు కాబట్టే బిగ్‌బీ అయ్యారు’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. దీనిపై నటి శిల్పాశిరోద్కర్ స్పందిస్తూ..  మీరు ఎప్పటికీ ఉత్తమ నటుడిగా నిలిచిపోతారు. అమిత్‌జీ అంటూ ప్రశంసించారు. సంజయ్ దత్ భార్య మనయతా దత్ స్పందిస్తూ హార్ట్ ఎమోజీని పెట్టారు. 

అమితాబ్ బచ్చన్ జంజీర్, దీవార్, డాన్, లావారీస్, కాలియా, త్రిశూల్ వంటి అనేక సూపర్‌హిట్ యాక్షన్ చిత్రాలలో నటించారు. కాగా ఆయన ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న కల్కి98ADతో అమితాబ్ ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకొణె, దిశాపఠాని వంటి నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.  మే 8న ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది. తమిళ చిత్రం వేట్టైయన్‌లో కూడా అమితాబ్‌ రజనీకాంత్‌తో కలిసి కనిపించనున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని