Anjali: ఆ కోరిక తీర్చింది గీతాంజలి

‘‘నా 50వ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. ఆ కోరిక ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’తో తీరింది. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆస్వాదించేలా మంచి వినోదంతో సినిమా చేశాం’’ అన్నారు కథానాయిక అంజలి.

Updated : 04 Apr 2024 09:42 IST

‘‘నా 50వ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. ఆ కోరిక ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’తో తీరింది. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆస్వాదించేలా మంచి వినోదంతో సినిమా చేశాం’’ అన్నారు కథానాయిక అంజలి. ఆమె ప్రధాన పాత్రధారిగా శివ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేశ్‌, సత్య, షకలక శంకర్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.వి.వి.సినిమాస్‌తో కలిసి కోన వెంకట్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు. సినిమా చిత్రీకరణకు ఓ ఇంటికి వెళ్లిన సినిమా బృందానికీ, ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలకీ మధ్య సాగే హంగామానే ఈ సినిమా అని చాటుతోంది ట్రైలర్‌. అంజలి మాట్లాడుతూ ‘‘కామెడీ, హారర్‌ అంశాల్ని మేళవించిన చిత్రమిది. ట్రైలర్‌ కంటే వంద రెట్లు సినిమా ఉంటుంది. మా బృందం వంద శాతం మనసు పెట్టి చేసింది. ప్రత్యేక గీతాన్నీ చిత్రీకరించాం. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. చిత్ర సమర్పకుడు, రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ ‘‘ఇది మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. అంజలికి 50వ సినిమా. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేయడం గొప్ప విషయం. నేను 55 సినిమాలకి రచయితగా పనిచేశా. అన్నిటినీ ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాని రచయితలు భాను, నందు మరో స్థాయికి తీసుకెళ్లారు. కథని నేనే ఇచ్చినా వాళ్లు దాన్ని పది మెట్లు పైకి  తీసుకెళ్లారు. ప్రవీణ్‌ లక్కరాజుని జూనియర్‌ తమన్‌ అని పిలుస్తుంటాం. ఈ సినిమాకి మంచి సంగీతం ఇచ్చాడు. ఎడిటర్‌ ఛోటా కె.ప్రసాద్‌ కీలక పాత్ర పోషించాడు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత డి.వి.వి.దానయ్య, శివ నిర్వాణ, శ్రీనివాస్‌రెడ్డి, బి.వి.ఎస్‌.రవి, సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, సంగీత దర్శకుడు ప్రవీణ లక్కరాజు, ఎడిటర్‌ ఛోటా కె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని