Adipurush: ‘ఆదిపురుష్‌’ మాటల వివాదం.. స్పందించిన కేంద్రమంత్రి

‘ఆదిపురుష్‌’ (Adipurush) సినిమా గురించి జరుగుతోన్న చర్చపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) స్పందించారు. ప్రజల విశ్వాసాలు దెబ్బతియ్యడాన్ని అంగీకరించమన్నారు.

Published : 19 Jun 2023 16:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆదిపురుష్‌’ (Adipurush)లోని మాటల చుట్టూ నెలకొని ఉన్న వివాదంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) తొలిసారి స్పందించారు. ప్రజల మత విశ్వాసాలను దెబ్బతియ్యడాన్ని, తాము అనుమతించమని అన్నారు. సినిమాలోని పలు ఇబ్బందికరమైన డైలాగ్స్‌ను చిత్రబృందం మార్చనున్నట్లు ప్రకటించిందని, దానిని తానూ పర్యవేక్షిస్తానని వెల్లడించారు.

మరోవైపు, దిల్లీ ఎంపీ, భాజపా నేత మనోజ్‌ తివారీ సైతం ‘ఆదిపురుష్‌’ గురించి తాజాగా మాట్లాడారు. డైలాగ్స్‌ విషయంలో చిత్రబృందం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ‘‘నేనింకా సినిమా చూడలేదు. కాకపోతే, ఇందులోని సంభాషణలు సరిగ్గా లేవని మాత్రం విన్నాను. వివాదానికి కారణమైన డైలాగ్స్‌ను మారుస్తున్నట్లు చిత్ర మాటల రచయిత మనోజ్‌ ఇప్పటికే ప్రకటించారు. చిత్రబృందం నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. అలాగే, సినిమాలోని చాలా విషయాలు గౌరవప్రదంగా లేవని ప్రేక్షకులు అంటున్నారు. రాముడు సర్వోన్నతుడు, కాబట్టి సినిమా పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు భవిష్యత్తులో జాగ్రత్తగా వ్యవహరించాలి. ’’ అని అన్నారు.

ప్రభాస్‌, కృతిసనన్‌ జంటగా ఓంరౌత్‌ చిత్రీకరించిన ‘ఆదిపురుష్‌’ విడుదలైన నాటి నుంచి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. కాకపోతే, సినిమాలోని పలు డైలాగ్స్‌, సన్నివేశాలు రామాయణానికి పూర్తి భిన్నంగా ఉన్నాయంటూ సినీ ప్రియులు విమర్శించారు. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్‌ను తప్పుబడుతూ సోషల్‌మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, చిత్రబృందం స్పందించి.. మనోభావాలను ఇబ్బందిపెట్టేలా ఉన్న కొన్ని డైలాగ్స్‌ను మార్చనున్నట్లు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు