Adipurush: దేశ ప్రజలకు ‘ఆదిపురుష్‌’ మేకర్స్‌ క్షమాపణలు చెప్పాలి: ఎంపీ ప్రియాంక

‘ఆదిపురుష్‌’ (Adipurush) మేకర్స్‌పై ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated : 17 Jun 2023 13:28 IST

ముంబయి: ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో అమర్యాదకరమైన సంభాషణలు ఉపయోగించినందుకు చిత్రబృందం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆమె ‘ఆదిపురుష్‌’ సినిమానుద్దేశిస్తూ శనివారం ట్వీట్‌ చేశారు.

‘‘పేలవమైన సంభాషణలు.. ముఖ్యంగా హనుమంతుడి డైలాగ్స్‌ విషయంలో ‘ఆదిపురుష్‌’ డైలాగ్‌ రైటర్‌ మనోజ్ ముంతాషిర్ శుక్లా, చిత్ర దర్శకుడు ఓంరౌత్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. వినోదం పేరుతో మనం పూజించే దేవుళ్లకు ఇలాంటి భాషను వినియోగించడం ప్రతి భారతీయుడి మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మర్యాద పురుషోత్తముడైన రాముడిపై సినిమా తీసి.. బాక్సాఫీస్‌ విజయం కోసం మర్యాదకు సంబంధించిన అన్ని హద్దులు దాటేయడం అస్సలు ఆమోదించదగ్గ విషయం కాదు’’ అని ఆమె పేర్కొన్నారు.

ప్రభాస్‌ - కృతిసనన్‌ జంటగా నటించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓంరౌత్‌ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి అంతటా మంచి టాక్‌ లభించింది. అయితే, సినిమాకు సంబంధించిన పలు విషయాల్లో సినీ ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. హనుమంతుడి సంభాషణలు. ఓ సన్నివేశంలో ఇంద్రజిత్తుతో హనుమాన్‌ చెప్పే డైలాగ్స్‌.. అంతటా చర్చకు దారి తీశాయి. ఆ సంభాషణలను తప్పుబడుతూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలోనూ ట్వీట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంకా చతుర్వేది సైతం ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని