Arjun: విశ్వక్‌సేన్‌.. కమిట్‌మెంట్‌ లేని నటుడు.. ఇది అన్‌ప్రొఫెషనలిజం: అర్జున్‌ అసహనం

విశ్వక్‌సేన్‌, ఐశ్వర్య సర్జా కీలక పాత్రల్లో అర్జున్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా చిత్ర బృందానికీ హీరో విశ్వక్‌సేన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో దర్శకుడు అర్జున్‌ ఇక విశ్వక్‌సేన్‌తో సినిమా చేయనని చెప్పారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో  మాట్లాడారు.

Published : 06 Nov 2022 01:22 IST

హైదరాబాద్‌: తన 42 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎవరి గురించి ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పలేదని, కానీ, విశ్వక్‌సేన్‌ (vishwak sen) చేసిన పనికి బాధకలిగి నా అభిప్రాయాలను పంచుకునేందుకే ఇక్కడకు వచ్చానని సీనియర్‌ నటుడు అర్జున్‌ (Arjun Sarja) అన్నారు. ఆయన దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌, ఐశ్వర్య సర్జా కీలక పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, గత కొన్ని రోజులుగా చిత్ర బృందానికి, విశ్వక్‌సేన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు రావడం మొదలయ్యాయి. తాజాగా కీలక షెడ్యూల్‌కు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ‘షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయండి’ అని విశ్వక్‌సేన్‌ సందేశం పంపడంపై అర్జున్‌ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాత్రింబవళ్లూ ఎంతో కష్టపడి సెట్‌ సిద్ధం చేసిన తర్వాత షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయమనడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నించారు. ఇక సినిమా నుంచి విశ్వక్‌ బయటకు వచ్చేసినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అర్జున్‌ అన్నారు.

‘‘నా సినిమా తర్వాతి షెడ్యూల్‌ కోసం కష్టపడి సెట్‌ను డిజైన్‌ చేశాం. ఉదయాన్నే ఆరు గంటలకు షూటింగ్‌ స్పాట్‌కు రావాలని అందరికీ ముందే చెప్పా. కానీ, ఆ రోజు ఉదయం 5గంటలకు నాకు విశ్వక్‌సేన్‌ నుంచి ఒక మెస్సేజ్‌ వచ్చింది. ‘సర్‌ ఐయామ్‌ సారీ. ప్లీజ్‌ క్యాన్సిల్‌ షూట్‌’ అని చూసే సరికి, ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఏ మాట్లాడాలో కూడా తెలియలేదు. కథ, క్యారెక్టర్‌, డైలాగ్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడనిపించింది. నేను జీర్ణించుకోలేకపోయా. మరీ ఇంత అన్‌ప్రొఫెషనలిజమా.  నిజంగా ఇది టెక్నీషియన్స్‌ను అవమానించడమే. ఆ తర్వాత ఆయన మేనేజర్‌ ‘సర్‌ మీతో తర్వాత మాట్లాడతా’ అని మెస్సేజ్‌ పెట్టారు. ఒక ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ అంటే అతనికి మర్యాద లేదా? ఈ హీరోను పెట్టుకుని పెద్ద సినిమా చేద్దామని, బాగా డబ్బులు సంపాదించాలని నేను అనుకోలేదు. ఒక మంచి సినిమా చేయలనుకున్నా. ఏ ఫైనాన్సియర్‌ దగ్గరా డబ్బులు అడగలేదు. ఇండస్ట్రీ అంటే ఎంతో నిబద్ధత కలిగిన నటులను చాలా మందిని చూశా. జగపతిబాబు నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌. ఆయన్ని డేట్స్‌ అడిగాను. ఆయన షెడ్యూల్‌ నాకు చూపించారు. అది పూర్తయిన తర్వాత రెండు నెలల పాటు ఎలాంటి సినిమాలు లేవని చెప్పారు. ‘నా కోసం మధ్యలో రెండు రోజులు సర్దుబాటు చెయ్’ అని అడిగితే, ‘అస్సలు కుదరదు. నేను వాళ్లకు కమిట్‌మెంట్‌ ఇచ్చాను’ అన్నారు. అది ఒక నటుడికి ఉండాల్సిన నిబద్ధత. ఈ సినిమా ఓపెనింగ్‌కు బాలకృష్ణగారిని పిలిచా. అదే రోజు అనుకుని ‘అడ్రస్‌ పెట్టు వస్తా’ అన్నారు. పది రోజులు తర్వాత అని చెప్పడంతో, ‘సారీ బాస్‌ నేను చేస్తున్న సినిమా డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ని అడిగి చెబుతా’ అన్నారు. అది నిబద్ధత. సినిమా పూజా కార్యక్రమం రోజున కూడా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి, రాలేకపోయినందుకు సారీ చెప్పారు. వెంకటేశ్‌, చిరంజీవి ఇలా అందరూ తమ ప్రొడ్యూసర్స్‌ని అడిగి వస్తామని చెప్పారు. అది కమిట్‌మెంట్‌. నేను అల్లు అర్జున్‌తో కలిసి పనిచేశా. షూటింగ్‌ అంటే సమయానికి వచ్చేస్తారు. అంత డబ్బు, పరపతి ఉన్నా, ఇంకా కష్టపడుతూనే ఉంటారు  కానీ, ఈ నటుడు(విశ్వక్‌సేన్‌) మాత్రం ‘రేపు షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయండి’ అని మెసేజ్‌లు పెడుతాడు’’

‘‘ఒక రోజు షూట్‌ అంటే ఎంత మంది కష్టం ఉంటుందో ఆలోచించండి. షూటింగ్‌ చేయాల్సిన సమయంలో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చారు. ఇది ఆయన గురించి చెడుగా ఆరోపణలు చేయడం కాదు. నా ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వెళ్లడం అంటే, నా పరపతికి దెబ్బ తగిలినట్లే. నా సినిమా నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని నేను అనుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో నేను సినిమా చేయదలచుకోవడం లేదు. అందుకే ఈ ప్రెస్‌మీట్‌. కొన్ని రోజులు పోయిన తర్వాత అతనితో కాంప్రమైజ్‌ అయి, ఈ సినిమా చేయను. సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు, చంద్రబోస్‌ పాటలు మనోడికి నచ్చడం లేదు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ ఇష్టపడటం లేదు. హీరోగా అతడు కొన్ని సూచనలు చేయొచ్చు తప్పులేదు. కానీ, ఒక మేకర్‌గా నాకు నచ్చాలి కదా! చాలా సార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేశా. అతడు వినలేదు. ఇలాంటివి అందరికీ తెలియాలి. బయటకు మాట్లాడలేని నిర్మాతలు చాలా మంది ఉంటారు. నాకు ధైర్యం, శక్తి ఉన్నాయి. అందుకే ఇలా చెబుతున్నా. డైరెక్టర్‌, నిర్మాత అనే వ్యక్తులకు మర్యాద ఇవ్వాలి. అది బేసిక్‌. మీకు కథ నచ్చకపోతే, ‘ఈ సినిమా చేయాల్సిందే’ అని ఎవరూ బలవంతం చేయరు. ఆఖరికి ప్రొడక్షన్‌ బాయ్‌ను కూడా తీసుకురాలేను. ఇండస్ట్రీలో పద్ధతులు తెలియకపోతే, సినిమాలు చేయకండి. ఎవరి ఇంట్లో వాళ్లు ఉందాం. ఈ వివాదంపై ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ మెంబర్స్‌తో మాట్లాడతా. ఇలా మరొకరికి జరగకుండా చూడమని మాత్రమే చెబుతా. అంతేకానీ, దీన్ని పెద్ద ఇష్యూ చేయాలని నాకు లేదు. నేను ఇక్కడ సినిమాలు మాత్రమే చేయడానికి వచ్చా. వివాదాలు సృష్టించడానికి కాదు. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. వేరొక నటుడితో ఈ సినిమా మళ్లీ మొదలు పెడతా. ’’ అని అర్జున్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని